అప్పట్లో ఎన్టీఆర్ - శ్రీదేవి అదరగొట్టే కాంబినేషన్

Update: 2018-02-25 07:44 GMT

సినిమా ప్రపంచం ఒక గొప్ప అగ్ర తారను, అద్భుతమైన నటిని కోల్పోయింది. ఆమె మరణం సినీ లోకాని కి తీరని వేదన. శ్రీదేవి ఇక లేదంటే నమ్మశక్యం కానీ వార్త. శ్రీదేవి అంటే ఇప్పటికి పడి చచ్చిపోయేవాళ్లు కోకొల్లలు. శ్రీదేవి అలా అలా నడిచొస్తుంటే.... దివి నుండి భువికి దిగొచ్చిన దేవతలాగా అందరూ నీరాజనాలు పట్టేవారు. అలంటి శ్రీదేవి ఇక లేరు... అనేది మింగుడు పడని విషయం. శ్రీదేవి 80వ దశకంలో ఇటు దక్షిణ భారతంలో అటు ఉత్తర భారతంలో తన నట విశ్వ రూపాన్ని చూపించింది. శ్రీదేవి ఎంతో మంది కలలు రాకుమారి. తన గ్లామర్ తో, నటనతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసేది. శ్రీదేవి ఉంటే చాలు ప్రేక్షకులు సినిమాకు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె కళ్ళల్లో మెరుపు అపురూపం, ఆమె నటన అనితర సాధ్యం . ఆమె ప్రవర్తన అనూహ్యం. అందమైన రూపం , అచ్చెరువు కొలిపే అభినయం, మాధుర్యంగా వుండే మాటలు ఇక తెరమీద తప్ప జీవితంలో కనిపించవు, విని పించవు. ఒకప్పుడు శ్రీదేవి, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే కాసులు కురిసేవి. నిర్మాతలు వీరి ఇద్దరితో సినిమా తీయాలని తహతహ లాడిపోయేవారు ఈ సినిమాను పంపిణి చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ క్యూ లో వుండే వారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని ప్రేక్షకులు ఎదురు చూసేవారు .

1972లో ఎన్టీఆర్, శ్రీదేవి బడిపంతులు అనే సినిమాలో చిన్న పిల్లగా నటించింది. ఆ తరువాత 1979లో వేటగాడు అనే సినిమాలో మొదట హీరోయిన్ గా నటించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎమ్ . అర్జున రాజు ఈ సినిమా నిర్మించాడు . ఆ టైం లో అందరు పెదవి విరిచారు . ఎక్కడ రామారావు , ఎక్కడ శ్రీదేవి ఇదేమి కాంబినేషన్? అని విమర్శించారు . అయినా ఆ కాంభినేషన్ మీద నమ్మకంతో అర్జున రాజు వేటగాడు సినిమా రూపొందించాడు. ఈ సినిమాలో 'ఆకు చాటు పిందె తడిచే , కొమ్మ చాటు పువ్వు తడిచే', 'జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి', 'బంగారు బాతు గుడ్డు బందారు చెక్కెర లడ్డు' పాటలు తెరమీద వస్తుంటే ఈలలు , కేకలు మారుమోగిపోయేవి. ముఖ్యంగా ఆకు చాటు పిందె తడిచే, కొమ్మ చాటు పువ్వు తడిచే పాట చూడటం కోసం కుర్ర కారు థియేటర్ లకు ఎగబడి వచ్చేవారు.

ఎన్టీఆర్ - శ్రీదేవి జంటగా నటించిన వేటగాడు సినిమా అనేక రికార్డులను నెలకొలిపింది. ఆ తరువాత ఎన్టీఆర్ గారితో 1980లో సర్దార్ పాపారాయుడు, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, ఆటగాడు, 1981లో కొండవీటి సింహం, గజదొంగ, అగ్గిరవ్వ, 1982లో వయ్యారి భామలు -వగలమారి భర్తలు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, అనురాగదేవత చిత్రాలు చేసింది . రామారావు రాజకీయాల్లోకి వెళ్లే ముందు 1983లో సింహం నవ్వింది సినిమాలో నటించింది .

ఎన్ .టి రామారావు శ్రీదేవి కాంభినేషన్ కు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. శ్రీదేవికి ఎన్టీఆర్ గారంటే ఎంతో గౌరవం. ఆయన్ని పెద్దాయన అనేది . రామారావు కూడా శ్రీదేవి తనకన్నా వయసులో ఎంతో చిన్నదైనా సాటి కళాకారిణిగా అభిమానించేవారు , ఆదరించేవారు , గౌరవించేవారు , ఎప్పుడూ ప్రోత్సహించేవారు .

Similar News