అన్నయ్య భజన చేసిన పవన్ !

Update: 2016-03-21 00:07 GMT

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ పూర్తి అయ్యింది. కళ్లు వాచిపోయేలా పవన్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో చూసిన ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందరూ మాట్లాడటం అయ్యాక.. చివర్లో మాట్లాడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీలైనంత వరకూ తన అన్నయ్య గురించి.. ఆయన గొప్పతనం గురించి చెప్పేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాజకీయాల్లో తమ ఇద్దరి పంథాలు వేరుగా ఉన్నప్పటికీ.. అన్నయ్య.. అన్నయ్యే అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రసంగంలో పవన్ ప్రస్తావించిన అంశాలు చూస్తే..

అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం ఉండేది. అన్నయ్య హీరో అయ్యాక.. అన్నయ్య ఒక్కరే హీరో అనిపించారు.

ఒకరోజు అన్నయ్య పిలిచి.. యాక్ట్ చేయొచ్చు కదా అని అన్నారు. అప్పటివరకూ నేను యాక్ట్ చేయగలనని అనుకోలేదు.

నేనీరోజు యాక్ట్ చేయగలుగుతున్నానంటే అందుకు కారణం నా అన్నయ్య.. వదినలే కారణం.

ఇంటికి నలుగురు వస్తే మొహమాటపడిపోయేవాడిని. అలాంటి వాడ్ని.. బలవంతంగా అందర్లోకి లాగేశాడు అన్నయ్య.

అన్నయ్య గురించి ఎప్పుడూ తక్కువగా మాట్లాడతుంటా. ఆయనంటే ఎంతో ఇష్టం. అదంతా లోపల ఉంటుంది. ఆయనంటే ఎంత ఇష్టమో వ్యక్తిగతంగా చెబుతుంటా. అన్నయ్య గురించి బహిరంగంగా బయటకు చెప్పుకోవటం ఏమిటి? సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా.

ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు.. ఒకటి ఊహించుకొని కష్టపడి ఒక స్థానానికి చేరుకోవటమే కాదు.. ఒక ప్లాట్ ఫాం క్రియేట్ చేశారు. ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి.. ఈ స్థాయికి వచ్చారు. చాలా ఆదర్శవంతమైన.. స్ఫూర్తివంతమైన వ్యక్తిగా నిలిచారు. ఒక లక్ష్యాన్ని అనుకుంటే సాధించగలనని నిరూపించారు. నాలాంటి చాలామందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి చిరంజీవి.

సినిమాలు చేయటం ఇష్టం లేదు. కథలు చదవటం ఇష్టం. సినిమాలు చేయమన్నప్పుడు నేను యాక్ట్ చేయగలనా? అనిపించింది.

పాలిటిక్స్ పరంగా ఆయనకు నచ్చకున్నా చేశా. ఆయన అర్థం చేసుకున్నారు కూడా. మా బంధం వేరు. రాజకీయాలు వేరు. అవి రెండు దారులు. నేను.. అన్నయ్య ఒకే పంథాలో లేకపోయినా.. అన్నయ్య నా గుండెల్లోనే ఉంటారు. పదే పదే ఫ్రూవ్ చేసుకోవాలని లేదు. సందర్భం వచ్చినప్పుడు నేను ఆయనకు ఎలా అండగా నిలబడతానో చూపిస్తా. నా తల్లిదండ్రుల తర్వాత నా అన్నయ్యే అన్నీ.

జానీ ఫెయిల్ అయ్యాక.. ఇంకాస్త కష్టపడితే బాగుండేదన్నారు. క్రియేటివి ప్రాసెస్ లో ఫెయ్యిలూర్ సహజం. అన్నయ్య చాలా బాధ పడ్డారు.

నిజానికి ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ రావాల్సిన సినిమా.

అలీ లేకపోతే ఏదో ఒక లోటు ఉంటుంది. అందుకే పెట్టుకుంటాం.

గడిచిన 48.. 50 రోజుల్లో 70 శాతం సినిమా తీశాం. ఈ సినిమా మీకు అందరికి ఆనందం కలిగించాలి. ఈ సినిమా ఏ ఒక్క సినిమాకో పోటీ అవుతుందని ఆలోచించలేదు. దీన్నో ఏదో సాధించాలనో.. మరేదో అని అనుకోలేదు.

అన్నయ్య సంస్కారం ఎంత గొప్పదంటే.. ఒక సినిమా పత్రిక కింద పడి ఉంది. తెలిసిన హీరో బొమ్మ ఉంది. దాన్ని ఎవరూ తీయలేదు. ఒక నటుడి ఫోటో ఉన్నది కింద పడి ఉంటే.. అలా వదిలేస్తారా అని తిట్టి.. దాన్నికింద నుంచి తీసి.. తుడిచి పక్కన పెట్టారు. అలాంటి సంస్కారం అన్నయ్యది.

Similar News