అతి చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు భారీ చిత్రం ఐయ్యింది

Update: 2017-02-16 12:02 GMT

తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఏకకాలంలో దాదాపు 3500 స్క్రీన్స్ పై విడుదల కాబోతోంది ఘాజి చిత్రం. భారత దేశంలోనే తొలి సబ్మెరైన్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోనున్న ఈ చిత్రం ముందు నేరుగా యూట్యూబ్ లో మాత్రమే విడుదల అయ్యే మెటీరియల్ తో అతి చిన్న సినిమాగా ప్రారంభమై మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్, పీవీపీ, రానా దగ్గుబాటి, కరణ్ జోహార్ వంటి పాపులర్ ఇండస్ట్రీ పర్సన్స్ ప్రమేయంతో మూడు భాషలలో తెరకెక్కిన ప్రయాణాన్ని క్షుణ్ణంగా వివరించారు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఫిబ్రవరి 17 న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో సంకల్ప్ రెడ్డి ఘాజి చిత్రానికి భీజం పడ్డ విశేషాలు వివరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ప్రయాణమే ఒక చిత్ర కథలా వుంది.

"2012 నవంబర్ 23 న నేను ప్రయాణం చేయవలసిన విశాఖపట్నం నుంచి అన్నవరం వెళ్లే రైలు మిస్ అయ్యాను. అప్పుడే తొలి సారి ఘాజి సబ్ మెరైన్ చూసాను. నాలో చాలా ఆసక్తిని రేకెత్తించింది ఆ సబ్ మెరైన్. అప్పటి నుంచి పది నెలల పాటు ప్రతి రోజు పి.ఎన్.ఎస్ ఘాజి కి సంబంధించిన అనేక మంది సాంకేతిక నిపుణుల్ని, నేవీ అధికారుల బృందాన్ని కలిసి ఎన్నో విలువైన వివరాలను సేకరించాను. అప్పటికి 25 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి పది వేలకు పైగా సబ్ మెరైన్ ఫోటోలు, మినియేచర్ సబ్మెరైన్ మోడల్స్ సిద్ధం చేసుకున్నాను. నా ప్రయత్నం అంతా యూట్యూబ్ లో ఆన్లైన్ విడుదల చేయటానికి తగినట్టుగా నేను సేకరించిన సమాచారానికి ఒక చిత్ర రూపం ఇవ్వటమే. ఆ సమయంలో మాటినీ ఎంటర్టైన్మెంట్స్ కి చెందిన నిరంజన్ రెడ్డికి నేను చేయబోయే ప్రయత్నం గురించి వివరించాను. ఆయన నన్ను పీవీపీ వద్దకు తీసుకు వెళ్లి నా కాన్సెప్ట్ నేరేట్ చేపించారు. పీవీపీ ప్రమేయంతో రానా దగ్గుబాటి, తాప్సి పన్ను, కరణ్ జోహార్ వంటి స్టార్స్ అందరూ చేరి నా చిన్న ప్రయత్నాన్ని సంచలనం చేసి ఏకంగా మూడు భాషలలో భారీ చిత్రంగా ఘాజి విడుదల అవటానికి దోహదపడ్డారు." అని ఘాజి తెర వెనుక ప్రయాణాన్ని వివరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

Similar News