అగ్ర స్థాయికి ఎదిగినవారందరు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారేమో

Update: 2016-12-27 20:30 GMT

2012 వరకు వివిధ చిత్రాల ద్వారా తన అభినయాన్ని ప్రదర్శించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, ఆమె క్వీన్ చిత్రంలో పోషించిన రాణి పాత్రతో యావత్ భారత సినీ పరిశ్రమను తన వైపు తిప్పుకుంది. కెరీర్ తొలి నాళ్ళ నుంచి తీసుకునే నిర్ణయాలు, చేసే వ్యాఖ్యలు, ఎంచుకునే పాత్రలతో చాలా బోల్డ్ గా కనిపించే కంగనా రనౌత్ తనకు గతంలో ఎదురైన అనేక అనుభవాలను, తాను ధాటి వచ్చిన గడ్డు పరిస్థితులను పలు మార్లు పంచుకుంది. బాలీవుడ్ లో అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయిన కంగనా రనౌత్ ఇప్పుడు మరో అడుగు ముందుకి వేస్తూ ఎవరూ బైటకి చెప్పటానికి సాహసించని విషయాలు బైటపెట్టి తన ఆవేదనలో నిజాయితీని చాటుకుంది కంగనా.

సినిమా పరిశ్రమలో కథానాయికల పరిస్థితి గురించి మాట్లాడుతూ తననే ఉదాహరణగా తీసుకుని వివరిస్తూ, "బాలీవుడ్ లో సినిమా అవకాశాల అన్వేషణలో వున్న కాలంలో నేను అనేక అవమానాలను ఎదుర్కొన్నాను. కెరీర్ ప్రారంభానికి ముందు, కెరీర్ ప్రారంభమైన తొలి నాళ్ళల్లో పలువురు అగ్ర కథానాయకులు నన్ను లైంగికంగా వాడుకున్నారు కూడా. గతంలో కూడా నేను ఈ వ్యాఖ్య చేసినప్పుడు కొందరు పరిశ్రమ ప్రముఖులు భుజాలు తడుముకున్నారే తప్పితే ఎవరూ కూడా నా వ్యాఖ్యలు అవాస్తవాలని ఖండించే ధైర్యం చేయలేకపోయారు. నేను చేసిన వ్యాఖ్యలు, పంచుకున్న అనుభవాలు అన్ని నిజాలే అని జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితి కేవలం నాకు మాత్రమే ఎదురైనది కాదు. ప్రస్తుతం అగ్ర తారలుగా వెలుగొందుతున్న వారందరికీ కెరీర్ తొలి దశలో ఈ పరిస్థితులు తప్పవు అని నా ఉద్దేశం. సినిమా కుటుంబాల నుంచి వచ్చిన నాయికలు ఇందుకు మినహాయింపు ఐయి ఉండొచ్చు. నేను ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకి ఎప్పటికి కట్టుపడి వుంటాను. ఏదో ఆవేశంలో ఆరోపణలు చేసి, తరువాత అవి వెనక్కి తీసుకోను. నేను ఆవేశంలో మాట్లాడినా నిజాలు మాత్రమే మాట్లాడతాను." అంటూ కుండ బద్దలుకొట్టి చెప్పింది కంగనా రనౌత్.

Similar News