అంత నీచమైన స్థాయికి నేను దిగజారలేదు

Update: 2017-01-22 08:12 GMT

తమిళ హీరో సూర్య కి తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాలలోనూ సుస్థిరమైన మార్కెట్ వుంది. అందుకే సికిందర్, మాస్, మేము, 24 వంటి వరుస వైఫల్యాల అనంతరం కూడా సూర్య తదుపరి చిత్రానికి ఫాన్సీ రేట్స్ దక్కాయి. కాగా గత ఏడాది దీపావళికే దర్శకుడు హరి సి-3 ని సిద్ధం చేసినప్పటికీ పలు కారణాలు చూపుతూ నిర్మాత జ్ఞానవేల్ రాజా చిత్ర విడుదలను ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చారు. దీనితో తమిళ ప్రజలతో పాటు తెలుగు ప్రేక్షకులలోనూ ఈ చిత్రం పై అంచనాలు తగ్గిపోయాయి. సూర్య అభిమానులు కూడా ఈ చిత్రం విడుదలపై ఆతృతగా లేకపోవటం గమనార్హం. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలుగుతో పాటు మళయాళ వెర్షన్ విడుదల హక్కులని కూడా భారీ లాభాలకి విక్రయించేశారు. పంపిణీదారులు, కొనుగోలుదారులకు కాసుల వర్షం కురవాలంటే సినిమా తిరిగి ప్రచారంలోకి రావాలి. ప్రచార చిత్రాలు, వీడియో సాంగ్స్ ఆ పని విజయవంతంగా చేయలేకపోతుండటంతో సూర్య చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ తమ చిత్ర వ్యాపారానికి ప్రచారం కలిపించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమిళనాడు లో నిన్నటి(21 జనవరి) వరకు జరిగిన జల్లికట్టు నిషేధం పై నిరసనలతో భాగంగా ధనుష్ వంటి పబ్లిక్ ఫిగర్ పెటా సంఘం నుంచి తాను గతంలో అందుకున్న అవార్డు ని అవమానం గా భావిస్తున్నానని వెల్లడించినప్పటికీ స్పందించనీ పెటా, సూర్య పై మాత్రం తీవ్ర ఆరోపణలు చేసింది. సూర్య నటించిన చిత్రం అతి త్వరలో విడుదల కానుండటంతో తమిళుల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా జల్లికట్టు సెంటిమెంట్ ని బలంగా వాడుకుని లబ్ది పొందుతున్నారని ఆరోపించింది. వివాదాలకు దూరంగా వుండే సూర్య ఈ ఆరోపణలకు తీవ్రంగానే స్పందించాడు. తమిళ ప్రజల మనోభావాలు కాపాడుకోవటానికి జరుగుతున్న నిరసనలు, ఉద్యమాన్ని తన సినిమా ప్రచారానికి వాడుకునేంత నీచపు స్థాయికి తాను దిగజారలేదని పెటా పై మండిపడ్డాడు సూర్య. తన సినిమా విడుదలలు లేని సమయాలలో కూడా తమిళ ప్రజలకు కష్టం వస్తే ఆ కష్టానికి తాను ఎదురు నిలబడ్డ సందర్భాలను గుర్తు చేశారు.

Similar News