విజయ్ ని వాడుకోలేకపోయాడా..?

Update: 2018-10-06 06:35 GMT

టాలీవుడ్ లో మూడున్నరేళ్లలో ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ లో అందరిలో ఉండని ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. యాటిట్యూడ్ ని శరీరంతో పాటు మొహంలో కూడా చూపిస్తాడు కనకే ఇంత త్వరగా యూత్ కి దగ్గరయ్యాడు విజయ్. అర్జున్ రెడ్డిలో ఇది పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసాడు కాబట్టే.. ఆ సినిమాతో విజయ్ కి అంత గొప్ప పేరు వచ్చింది. కానీ విజయ్ నటించిన తాజా చిత్రంలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ని, క్రేజ్ ని తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ వాడుకోలేకపోయాడు.

పూర్తి న్యాయం చేసిన విజయ్...

నోటా లో డ‌మ్మీ సీఎమ్‌ అన్నట్టుగానే విజయ్ దేవ‌ర‌కొండ పాత్ర కూడా చాలాసార్లు డ‌మ్మీగా ఉండిపోవాల్సి వ‌స్తుంది. రౌడీ సీఎంగా విజయ్ దేవరకొండ నోటా సినిమాని సాధ్యమైనంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేసాడు. తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు జనానికి వివరణ ఇచ్చుకునే సన్నివేశంలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సినిమాలో చాలా సన్నివేశాల్లో చుట్టూ ఉన్న అంశాలు బలహీనంగా ఉండటంతో చాలాచోట్ల నిస్సహాయంగా మారిపోయాడు. మైనపు ముద్ద లాంటి విజయ్ దేవరకొండ దర్శకుడు ఎలా మలుచుకుంటే అలా మారిపోతాడు. అయితే ఇప్పటి దాకా ఇతన్ని సరిగ్గా వాడుకున్న దర్శకులే దొరికారు కాబట్టి అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నోటాకు ఆ ఛాన్స్ లేదు. ఉన్నంతలో విజయ్ దేవరకొండ తన వరకు పూర్తి న్యాయం చేసాడు.

కథ.. కథనం.. బలంగా లేక...

అయితే సరదాలకు అలవాటు పడిన ఒక సీఎం కొడుకు అనుకోకుండా పెద్ద బాధ్యతలు మోయాల్సి వస్తే అది ఊహించని సవాళ్లను తన ముందు పెడితే ఎదురుకునే యువకుడిగా విజయ్ తన బెస్ట్ ఇచ్చాడు. పాత్రలో ఉన్న ఇంటెన్సిటినీ తన శాయశక్తులా చూపించిన విజయ్ ఈ సినిమాలో కేవలం దర్శకుడి వల్ల ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. నోటా కథలో బలం లేకపోయినా... కథనం కూడా బలహీనంగా ఉండటంతో అంతకు మించి పెర్ఫర్మ్ చేసే అవకాశం లేకపోయింది. సీఎం ఓ రూమ్‌లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ.. సంత‌కాలు చేస్తుంటాడు. అది తొందరగా ప్రేక్షకుడు జీర్ణించుకోలేని విషయం. ఇక ఒక్కసారిగా విజయ్ లో మార్పొచ్చి ఒక్కరోజు సీఎం మాదిరిగా సీఎంలా బిహేవ్ చేయడం అన్నీ నాటకీయంగా కనబడతాయి. మరి అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో అందుకున్న బ్లాక్ బస్టర్ క్రేజ్ నోటాతో మాత్రం దిగిపోతుంది.

Similar News