బాబూ విజయ్... ఏంటి బాబూ ఇది..!

Update: 2018-09-03 06:20 GMT

విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన 'గీత గోవిందం' రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఆ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. మొదటి వారం ఈ సినిమా ఏకంగా 40 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాతి వారం అంటే రెండో వారంలో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా అవి ఏ మాత్రం ఈ సినిమా జోరును ఆపలేకపోయాయి. వాటి ప్రభావం ఏ మాత్రం ఈ సినిమాపై పడలేదు. దీంతో రెండో వారంలో కూడా 'గీత గోవిందం' బాక్సాఫీస్ లీడర్ గా నిలిచింది.

కొత్త సినిమాలు వస్తున్నా...

ఇక ఈ వారం అంటే మూడో వారంలో నాగ శౌర్య నటించిన ‘నర్తనశాల’ పై చాలా ఆశలు పెట్టుకున్నారు అంతా. అలానే అల్లు అరవింద్ 'పేపర్ బాయ్' సినిమాను రిలీజ్ చేశారు. వీటితో పాటు కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘కోకో కోకిల’ సినిమాకు మంచి టాక్ తో రిలీజ్ అయింది. దీంతో ఈ మూడు సినిమాలు 'గీత గోవిందం'కు అడ్డుకట్ట వేస్తాయి అని భావించాయి ట్రేడ్ వర్గాలు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఈ కలెక్షన్స్ చూస్తే చెప్పొచ్చు...

‘నర్తనశాల’ సినిమాకు సాయంత్రానికే వసూళ్లు పడిపోయాయి. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 'పేపర్ బాయ్' పర్లేదు అనిపించుకున్నా ఆ సినిమా ప్రభావం 'గీత గోవిందం'పై పడదు. ‘కోకో కోకిల’ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ట్రేడ్ లెక్కల ప్రకారం శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 'గీత గోవిందం' రూ.93 వేల దాకా వసూళ్లు వస్తే.. ‘నర్తనశాల’కి రూ.13 వేల పైచిలుకు గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక ‘పేపర్ బాయ్’ రూ.22 వేలు, ‘కోకో కోకిల’ రూ.18 వేలు తెచ్చుకున్నాయి. ఈ మూడు సినిమాల కలెక్షన్స్ కలుపుకున్నా 'గీత గోవిందం' వసూళ్లలో 60 శాతమే ఉన్నాయి. దీనిబట్టి చూస్తుంటే విజయ్ ప్రభావం టాలీవుడ్ పై ఏ రేంజ్ లో పడిందో అర్థం అవుతుంది.

Similar News