యువ హీరోతో విజయ్ దేవరకొండకి గొడవ..?

Update: 2018-10-11 08:52 GMT

టాలీవుడ్ లో అనతికాలంలోనే స్టార్ హీరోల రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇబ్బందులు పడ్డా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలు విజయ్ ని స్టార్ హీరోని చేశాయి. అయితే, ఆయన ఇటీవల నటించన తమిళ డబ్బింగ్ సినిమా నోటా విజయం సాధించలేకపోయింది. అయితే, నోటా ఫలితంపై విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేశాడు. నోటా ఫెయిల్ కి తనదే బాధ్యత అని, కానీ, ఈ ఒక్క పరాజయం నా ఆటిట్యూడ్ ను మార్చదని పేర్కొన్న విజయ్ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకుని విజయం కోసం పోరాడతానని పోస్ట్ చేశాడు. అంతేకాదు తన పరాజయాన్ని చూసి సంబరపడుతున్న వారు ఇప్పుడే పండగ చేసుకొండి అని హితవు చెప్పాడు. అయితే, విజయ్ పరాజయాన్ని చూసి ఎవరు సంబరపడుతున్నారో మాత్రం తెలియలేదు.

ట్వీట్ చేసి డిలీట్ చేసిన నిఖిల్..

కానీ, ఇప్పుడు మరో యువ హీరో నిఖిల్ చేసిన పోస్ట్ చూస్తే వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ ఉండేమో అని అనుమానాలు వస్తున్నాయి. నిఖిల్ ఓ ట్వీట్ లో ‘ఎవరైతే ప్రపంచమే తన చుట్టూ తిరుగుతుందని భావిస్తూ అనవసర యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తారో వారికి... నువ్వు అంత ముఖ్యమైన వ్యక్తివి కాదు... ప్రతీ నటుడు తనతో తానే పోటీ పడతాడు. మనం సినిమా ప్రపంచంలో ఒక నీటి చుక్క లాంటి వాళ్లం’’ అని అన్నాడు. అయితే, తమ అభిమాన హీరోనే నిఖిల్ టార్గెట్ చేశారని భావించిన విజయ్ దేవరకొండ అభిమానులు నిఖిల్ కు వ్యతిరేకంగా పోస్ట్ లు చేయడం ప్రారంభించడంతో నిఖిల్ వెంటనే ఆయన ట్వీట్ ను డిలీట్ చేశాడు. ఇక ఇంతకుముందు హీరో నాగశౌర్య కూడా చిరంజీవి తప్పించి ఇండస్ట్రీలో ఎవరూ స్టార్లు లేరు అని విజయ్ దేవరకొండను ఉద్దేశించే అన్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Similar News