సందీప్ బాటలోనే అజయ్ కూడా..!

Update: 2018-07-18 06:21 GMT

గత ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా బోల్డ్ కంటెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా అర్జున్ రెడ్డి సినిమాని తన తమ్ముడి నిర్మాణంలో సైలెంట్ గా తెరకెక్కించి... సినిమా విడుదలకు ముందు తర్వాత సెన్సేషన్ సృష్టించాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమా తో హీరో, హీరోయిన్ తో పాటు దర్శకుడికి కూడా మంచి పేరొచ్చింది. అటు విజయ దేవరకొండ ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటుంటే... ఇటు సందీప్ వంగా పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు. అయితే స్టార్ హీరోలతో ప్రస్తుతం సినిమాలు చెయ్యడం కుదరని సందీప్ వంగా తన అర్జున్ రెడ్డి సినిమా తో బాలీవుడ్ కి చెక్కేసాడు. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేస్తూ రెండో సినిమాకే బాలీవుడ్ వెళ్లిన డైరెక్టర్ గా పేరు కొట్టేసాడు.

దూసుకుపోతున్న ఆర్ఎక్స్ 100

తాజాగా మరో డైరెక్టర్ కూడా తన రెండో సినిమానే బాలీవుడ్ లో చేసేంత రేంజ్ కి పెరిగిపోయాడు. కార్తికేయ అనే కొత్త కుర్రాడితో పాయల్ రాజపుట్ హీరోయిన్ గా అజయ్ భూపతి అనే కొత్త కుర్రాడు Rx 100 అనే బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాని సైలెంట్ గా తెరకెక్కించి ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి సినిమా విడుదలయ్యాక కూడా సో సో టాకే నడిచింది. కానీ సినిమా విడుదలైన రెండు రోజులకు గానీ Rx 100 సత్తా బయటికి రాలేదు. ఆ సినిమా ఇప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపుతుంది. కేవలం ఐదు రోజుల్లోనే Rx 100 రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 6 కోట్లు వసూలు చేసి అదుర్స్ అనిపిస్తే... వరల్డ్ వైడ్ గా దాదాపుగా ఎనిమిది కోట్ల మార్కుని దాటుకుని 10 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతుంది. చిన్న సినిమాగా విడుదలైన RX ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఆ డైరెక్టర్ కి మంచి పేరు వచ్చేసింది.

రెండో సినిమా బాలీవుడ్ లోనే..?

అయితే అజయ్ భూపతి వెంట టాలీవుడ్ యంగ్ హీరోలు పడుతున్నారనే న్యూస్ నడుస్తున్న వేళ అజయ్ ఒక షాకిచ్చాడు. ఇప్పుడు తన దగ్గర స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రేంజ్ కథలున్నాయని.. కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది అనేది చెప్పలేనని చెప్పిన ఈ కుర్ర డైరెక్టర్ తాను పూర్తి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకెళితే ఆఘమేఘాల మీద షూటింగ్ పూర్తి చేసేస్తానని చెబుతున్నాడు. ఇక తన మొదటి సినిమా Rx 100 బాలీవుడ్ రీమేక్ రైట్స్ కోసం ఫాంటమ్ కంపెనీ వాళ్లు తనని అప్రోచ్ అయ్యారని... మరి ఇలా రెండో సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం తనకి చెప్పలేనంత ఆనందంగా ఉందంటున్నాడు ఈ కుర్ర డైరెక్టర్.

Similar News