టాలీవుడ్ లో గురువారం సెంటిమెంట్..!

Update: 2018-08-22 07:03 GMT

సెంటిమెంట్స్ విషయంలో టాలీవుడ్ ఒక అడుగు ముందు ఉంటుందని సినిమాల రిలీజ్ అయ్యే తీరు చూస్తే మనకే అర్థం అవుతుంది. సినిమాలను ఫలానా టైంలో రిలీజ్ చేస్తేనే హిట్ అవుతుంది అన్న మాట మన టాలీవుడ్ వారు బలంగా నమ్ముతారు. కొన్నిసార్లు గ్రహ బలాన్ని పరిగణలోకి తీసుకోక తప్పదు అనిపిస్తుంది. సాధారణంగా మన తెలుగు సినిమాలు దాదాపుగా శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం అంటే శుభం కాబట్టి. అంతేకాకుండా శుక్రువారం నుండి వీక్ ఎండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి.

బుధవారం విడుదలై...

ఇది ఎప్పటినుండో జరుగుతున్న తంతే. కానీ ఈ మధ్య కాలం నుండి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కువ అయ్యిపోవడం...సినిమాల డేట్స్ క్లాష్ అవ్వడంతో కొన్ని సినిమాలను శుక్రవారం రిలీజ్ చేయడానికి సాధ్య పడటం లేదు. అందుకే వేరే వారాలని చూసుకుంటున్నారు. 2018 లో బుధవారం రిలీజ్ అయినా 'గీత గోవిందం'..'మహానటి' సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. వారంతో సంబంధం లేదు.. కంటెంట్ తోనే సంబంధం అని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. కానీ గురువారం మాత్రం మన మేకర్స్ కి సెంటిమెంట్ గా మారిందనే చెప్పాలి. ఈ వివరాలు చూస్తే మీకే అర్ధం అవుతుంది.

గురువారం విడుదలైతే ఇక అంతేనా..?

ఈ ఏడాది గురువారం 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 5న 'ఛల్ మోహనరంగా' పర్లేదు అనిపించుకుంది కానీ కలెక్షన్స్ లేవు. ఏప్రిల్ 12న 'కృష్ణార్జున యుద్ధం' డిజాస్టర్ గా నిలించింది. జూన్ 7న రజిని 'కాలా' మూవీది కూడా అదే పరిస్థితి. జూన్ 14న కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' మూవీ జనాలకు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. జులై 5న గోపీచంద్ మూవీ 'పంతం' కూడా అంతే. జులై 12న మెగా స్టార్ చిన్నల్లుడిని పరిచయం చేస్తూ వచ్చిన 'విజేత' సినిమా పర్లేదు అనిపించుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. ఇక నితిన్ మూవీ 'శ్రీనివాస కళ్యాణం' కలెక్షన్స్ అయితే పాతిక కోట్ల దాకా చేసింది కానీ జనాలకు నచ్చలేదు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ గురువారం రిలీజ్ అంటే భయపడుతున్నారు. పోనీ శుక్రవారం రిలీజ్ చేద్దాం వేరే సినిమాలతో క్లాష్ అవుతున్నాయి. వారంతో పనిలేదు మాకు సినిమా మీద పూర్తి నమ్మకం ఉందంటే గురువారం రిలీజ్ చేసుకున్న సినిమా ఆడే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఈ గురువారం సెంటిమెంట్ ఎంతవరకు వెళ్తుందో.

Similar News