టాక్సీవాలాకు తిరుగులేదుగా..!

Update: 2018-11-24 09:52 GMT

గత శుక్రవారం అమర్ అక్బర్ ఆంటోని, శనివారం టాక్సీవాలా సినిమాలు విడుదలవ్వగా.... టాక్సీవాలా హిట్ అయ్యింది. అమర్ అక్బర్ ఆంటోని ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ వారం మాత్రం హెబ్బా పటేల్ క్రేజ్ తో 24 కిస్సెస్, బిగ్ బాస్, నచ్చావులే ఫేమ్ తనీష్ హీరోగా నటించిన రంగు సినిమా, లా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాల్లో హెబ్బా పటేల్ 24 కిస్సెస్ మీద కాస్త అంచనాలున్నాయి. కానీ ఆ సినిమా కూడా ఈవారం తుస్ మంది. హెబ్బా పటేల్ అందం, అలాగే హీరో ఆదిత్, హెబ్బాల కెమిస్ట్రీ తప్ప ఇంకేమి ఆ సినిమాలో ప్లస్ పాయింట్స్ కనబడలేదు. సినిమాలో కథ, కథనం, డైరెక్షన్, పాటలు ఏమీ బాగాలేవని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ...

ఇక తనీష్ రంగు అయితే... రంగు పడుద్ది అనే రేంజ్ లో ఉందని... క్రైం డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలోని కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోగా ఫేడవుట్ అయిన టైంలో తనీష్ ఇలా రంగు సినిమాతో ప్రేక్షకుల ముందు రావడం, అలాగే బిగ్ బాస్ క్రేజ్ తో సినిమాకి ఏమైనా క్రేజ్ వస్తుంది అనుకుంటే అదీ లేదు. దర్శకుడు ఈ సినిమాని కొన్ని నిజజీవిత ఘటనల ఆధారంగా కథను రాసుకున్నప్పటికీ.. తెరకెక్కించడంలో చేసిన తప్పిదాలతో ఆ సినిమా గురించి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. తనీష్ చేసిన ప్రమోషన్స్ కూడా బీ, సీ సెంటర్స్ ని ఆకట్టుకోలేకపోయాయి.

ఈ వారం కూడా టాక్సీవాలాదే...

ఇక ‘లా’ సినిమా కూడా ఈ వారమే విడుదలైంది. ఎప్పుడో ఆవకాయ్ బిర్యానీతో హీరోగా మారిన కమల్ కామరాజు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఏ మాత్రం అవగాహనా లేకపోవడం, ప్రమోషన్స్ వీక్ కావడంతో ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లినట్లుగా ఉంది. ఇక ఈ మూడు సినిమాలు ఈ వారం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. మరి ఈ మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం ఇప్పుడు టాక్సీవాలా సినిమా పాలిట వరంగా మారింది. మరి ఈ వారం కూడా విజయ్ కి కలిసొచ్చిందనే చెప్పాలి. అంటే ఈ వారం కూడా టాక్సీవాలాదే అన్నమాట.

Similar News