తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్నచూపా..?

తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి మర్కెట్ ఉంటుంది. రజనీకాంత్, విజయ్, అజీత్, సూర్య, విశాల్, కార్తీ ఇలా ఏ హీరో సినిమా అయినా తెలుగులో ఆ సినిమాని [more]

Update: 2019-01-05 07:22 GMT

తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి మర్కెట్ ఉంటుంది. రజనీకాంత్, విజయ్, అజీత్, సూర్య, విశాల్, కార్తీ ఇలా ఏ హీరో సినిమా అయినా తెలుగులో ఆ సినిమాని కొనుక్కుని డబ్ చేస్తుంటారు. కొన్ని సినిమాలు లాభాలు తెస్తాయి. మరికొన్ని అక్కడక్కడికి సరిపోతాయి. తాజాగా 2.ఓ సినిమాని తెలుగు వాళ్లు భారీ ధరకు కొనుగోలు చేశారు. అయితే తెలుగులో ప్రతి సినిమాని డబ్ చేసే తమిళ హీరోలు ఇక్కడ తమ సినిమాల ప్రమోషన్స్ ని చాలా లైట్ తీసుకుంటున్నారు. 2.ఓ సినిమాని భారీగా కొన్నప్పటికీ 2.ఓ టీం ఒక్కసారి మాత్రమే హైదరాబాద్ లో ఓ ఈవెంట్ చేసేసి చేతులు దులిపేసుకుంది. ఇక గత వారం విడుదలైన మారి 2 సరైన ప్రమోషన్స్ లేక ఆ సినిమా ఎప్పుడు విడుదలైందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియని పరిస్థితి.

‘పేట’కు నో ప్రమోషన్స్

ప్రస్తుతం రజనీకాంత్ పేట పరిస్థితి అలానే ఉంది. పేట సినిమా తెలుగు, తమిళంలో ఒకేరోజు అంటే జనవరి 10 నే విడుదలవుతుంది. ఆ సినిమా మొన్నటి వరకు తెలుగు పోస్టర్ కూడా విడుదల చెయ్యలేదు. ఇక కాలా, కబాలి సినిమాల దెబ్బకి పేట సినిమాని కొనడానికి నిన్నమొన్నటి వరకు నిర్మాతలెవరు సాహసం చెయ్యలేదు . కాలా, కబాలి, 2.ఓ సినిమాల టాక్ తో రజనీ మార్కెట్ తెలుగులో అనూహ్యంగా పడిపోయింది. తమిళంతో పోటీపడి తెలుగులో అభిమానులను సంపాదించుకున్న రజనీకి ప్రస్తుతం తెలుగులో ఓ అన్నంత మార్కెట్ లేదు. అయితే పేట సినిమాని ఫర్వాలేదనిపించే రేటుకే కొన్నారు.

ఇలా అయితే కొట్టుకుపోవడం ఖాయం

మరి తమిళనాట భారీ అంచనాలున్న పేట సినిమాపై తెలుగులోనూ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే తమిళంలో చేసిన ప్రమోషన్స్ పేట విషయంలో తెలుగులో కనబడం లేదు. తమిళనాట పేట ఆడియో వేడుకని గ్రాండ్ గా చేసిన నిర్మాతలు తెలుగులో సరైన ప్రమోషన్స్ చెయ్యడం లేదు. అసలు తెలుగు ప్రేక్షకులంటే తమిళ తంబీలకు అంత చిన్న చూపా..? అనే ఫీలింగ్ కలగక మానదు. విడుదలకు పట్టుమని వారం రోజులు కూడా లేదు… ఈ సినిమాకి కనీస ప్రమోషన్స్ లేకపోతె ఇక్కడ తెలుగు సినిమాలు అంటే… సంక్రాంతికి విడుదల కాబోయే ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాల్లో పడి కొట్టుకుపోవడం ఖాయంగానే కనబడుతుంది.

Tags:    

Similar News