సైరా విషయంలో పక్కదారి పట్టిస్తున్నారా..?

Update: 2018-10-02 06:23 GMT

రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బడా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సైరా నరసింహరెడ్డి సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుని దాదాపుగా ఒక ఏడాది కావొస్తుంది. ఇప్పటివరకు సైరా నరసింహారెడ్డి షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. కానీ సైరా గురించిన వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు షేక్ చేస్తూనే ఉన్నాయి. పలు భాషల నటులు నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లనే ప్రచారం ఉంది. రామ్ చరణ్ చెప్పకపోయినా బన్నీ ఇచ్చిన క్లూతో సైరా బడ్జెట్ విషయంలో అందరితోపాటు మీడియా కూడా ఒక అంచనాకి వచ్చింది.

ఒక్క ఫైట్ కు 50 కోట్లు..?

అయితే తాజాగా సైరా నరసింహారెడ్డి క్లైమాక్స్ మారుస్తున్నారని న్యూస్ తో పాటుగా ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సన్నివేశానికి గాను కోట్ల రూపాయలు కాదు కాదు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని.. ఒక యాక్షన్ సన్నివేశానికి సైరా కోసం ఇంత బడ్జెట్ రామ్ చరణ్ పెడుతున్నాడని తెగ ప్రచారం జరుగుతుంది. ప్ర‌స్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్ జార్జియాలో జ‌రుగుతోంది. అక్క‌డే సినిమాకి కీలకమైన ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌ని తెర‌కెక్కిస్తున్నార‌ని.... అందుకోసం విదేశీ ఫైట్ మాస్ట‌ర్లు కూడా ప‌నిచేస్తున్నార‌ని... ఈ యాక్షన్ సీన్ కే 50 కోట్ల ఖర్చంటూ తెగ ఊదరకొడుతున్నారు. అయితే జార్జియాలో సైరాకి సంబంధించి కీలకమైన యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న విషయం నిజమే కానీ.. ఆ యాక్షన్ సీన్ కి 50 కోట్లు ఖర్చు అన్నది అబద్ధమంటున్నారు.

నాలుగు ఫైట్లకు కలిపి..!

అది కేవలం రూమర్ అని.. సైరాకి సంబంధించిన కథలో నాలుగు హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని... ఫస్ట్ హాఫ్ లో రెండు, సెకండ్ హాఫ్ లో రెండు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. అయితే నాలుగు యాక్షన్ సన్నివేశాలకు కలిపి 50 కోట్ల ఖర్చు అవుతుందట. కానీ.. కేవలం జార్జియా ఫైట్ కే 50 కోట్లు కాదట. జార్జియాలో సైరా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసే పని లేదు. అక్కడే పెద్ద పెద్ద కోట‌లున్నాయి. ఆ కోటలు సైరా యుద్ధ సన్నివేశాలకు పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో అక్కడ షూటింగ్ చేస్తున్నారు సైరా బృందం. అంతేకాకుండా ఇక్క‌డి నుంచి జూనియ‌ర్ ఆర్టిస్టుల్ని తీసుకెళ్లే అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే అక్క‌డి జార్జియా ప్రజలనే బ్రిటీష్ సైన్యంగా ఉప‌యోగించుకోవొచ్చు. మరి సెట్స్, జూనియర్ ఆర్టిస్ట్ ల ప్రయాణ ఖర్చులు ఇవన్నీ లేకపోతె ఇక ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ ఒక్క ఫైట్ కే 50 కోట్ల ఖర్చంటూ ప్రచారం జరగడంలో ఏదైనా పబ్లిసిటీ మాయాజాలం దాగుందేమో సైరా బృందానికే తెలియాలి.

Similar News