మెగాస్టార్ స్టామినా ఇది..!

Update: 2018-08-22 07:28 GMT

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈ రోజును పురస్కరించుకుని.. ఒక రోజు ముందే మెగా అభిమానులను సర్ప్రైజ్ చేసి వారికీ కిక్ ఇచ్చేట్లుగా మెగాస్టార్ చిరు 151 వ చిత్రం సై రా నరసింహారెడ్డి టీజర్ ని వదిలింది చిత్ర బృందం. మరి సై రా నరసింహ రెడ్డి టీజర్ ని వీక్షించిన మెగా అభిమానులు చిరు పుట్టిన రోజు ఇవాళ అయితే నిన్ననే పండగ చేసేసుకున్నారు. సై రా టీజర్ ఆ రేంజ్ లో మెగా అభిమానులను అలరించింది. సై రా సినిమా ఈ ఏడాది రాకపోయినప్పటికీ... గత ఏడాది మెగాస్టార్ చిరు పుట్టిన రోజు సందర్భంగా సై రా మోషన్ పోస్టర్ ని వదిలినట్టుగానే... ఈ ఏడాది పుట్టిన రోజుకి సై రా టీజర్ తో ఉర్రుతలూగించారు.

యూట్యూబ్ లో రికార్డులు...

నిన్న మంగళవారం 11.30 నిమిషాలకు విడుదలైన సై రా టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉన్న సై రా టీజర్ ను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 11 మిలియన్ల డిజిటల్ వ్యూస్ లభించాయి. మరి ఈ మిలియన్ వ్యూస్ చూస్తుంటేనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్ధమవుతుంది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తేనే ఆయన అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా చిరుని నెత్తిన పెట్టుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన చిరు నుండి ఇప్పుడు చారిత్రాత్మక చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి మీద కూడా భారీ అంచనాలున్నాయనడానికి యూట్యూబ్ రికార్డులే నిదర్శనం.

Similar News