ఇది బాహుబలి కాదు.... మెగా బాహుబలి..!

Update: 2018-08-21 08:05 GMT

టాలీవుడ్ చరిత్రలోనే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సువర్ణాక్షరాలతో రాసేంత బడ్జెట్ తో పాటు అంతే ఘనమైన విజయాన్ని అందుకుంది. బాహుబలి 1, 2 రెండు సినిమాలకూ ఆ సినిమా నిర్మాతలు లెక్కలేకుండా ఖర్చు పెట్టి వరల్డ్ వైడ్ గా విడుదల చేసి లాభాలు మొటగట్టుకున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే బాహుబలి పేరు మకుటాయమానంగా వెలిగిపోయింది. అయితే ఇప్పుడు చిరంజీవి హీరోగా రేసు గుర్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సై రా నరసింహారెడ్డి చిత్రం బాహుబలిని తలదన్నే రీతిలో కనబడుతుంది. సుమారుగా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సై రా నరసింహారెడ్డి టీజర్ చూస్తుంటే బాహుబలికి పోటీ మరో తెలుగు సినిమా సై రానే అనిపిస్తుంది.

పోరాటయోధుడిగా చిరంజీవి

చిరంజీవి పుట్టినరోజు రేపు అయితే.. ఒకరోజు ముందుగానే మెగా ఫాన్స్ కి చిరంజీవి పుట్టిన రోజు కానుక అందేసింది. తాజాగా ఈ రోజు మంగళవారం ఉదయం విడుదల చేసిన చిరు సై రా నరసింహారెడ్డి టీజర్ లో భారత ప్రజల మీద అప్పటి బ్రిటీష్ పాలకుల దాష్టీకాల్ని తెరమీద చూపిస్తూ వాటికి ధైర్యంగా ఎదురొడ్డి నిలిచే సై రా నరసింహారెడ్డి సాహసాలను చూపించారు. వ్యాపారం నిమిత్తం భారతదేశంలోకి అడుగుపెట్టిన ఆంగ్లేయులు యావత్ దేశాన్ని హస్తగతం చేసుకుని పాలిస్తున్న తరుణంలో వారి ఆధిపత్యాన్ని ఎదురించి నిలబడ్డా పోరాట యోధునిగా సై రా నరసింహారెడ్డి ని చూపించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మొదటి సమరయోదుడి పాత్రలో చిరంజీవి కరెక్ట్ గా సెట్ అయ్యారు. ఆ మీసం, ఆ హెయిర్ స్టయిల్, ఆ రౌద్రం, ఆ గంభీరం, మొహంలో ఆ ప్రసన్నం.... సింహంలా దూసుకొచ్చి మరీ గర్జించాడు. కళ్లతో చిరంజీవి పలికించిన రెండు మూడు క్షణాల రౌద్రం ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకున్న సాంకేతిక నిపుణులు...

మరి ఈ సై రా టీజర్ చూస్తుంటే...ఇది బాహుబలి కాదు... మెగా బాహుబలి అన్న రేంజ్ లో కనబడుతుంది. ఆకట్టుకునే నిర్మాణ విలువలు, రత్నవేలు ఫోటో గ్రాఫి, సురేందర్ రెడ్డి డైరెక్షన్ స్కిల్స్, ప్రధానంగా టీజర్ లో వినిపించిన మ్యూజిక్ టీజర్ కే హైలెట్ అనేలా ఉండడం... రెహ్మాన్ తప్పుకున్నాక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ రావడం.. ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం, మ్యూజిక్ హైలెట్ అనేలా ఉన్నాయి.

Similar News