రజనీకాంత్ భార్యకు సుప్రీం కోర్టు షాక్

Update: 2018-07-10 14:06 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ కు చీటింగ్ కేసులో చిక్కులు తప్పడం లేదు. ఈ కేసులో ఆమెను విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2014లో విడుదలైన రజనీకాంత్ కొచ్చాడియన్ చిత్రం హక్కులకు సంబంధించి లతా రజనీకాంత్ తమకు రూ.6.20 కోట్లు బకాయి పడ్డారని బెంగళూరుకు చెదిన యాడ్ బ్యూరో అనే సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు బకాయి సొమ్మును చెల్లించాలని ఫిబ్రవరీలో లతను ఆదేశించింది. ఇందుకు గానూ మూడు నెలల సమయం కూడా ఇచ్చింది. అయితే, ఆమె బకాయిని చెల్లించలేదు. దీంతో జూన్ 3న కోర్టు ఆమెను మందలించింది. అయినా కూడా ఆమె స్పందించకపోవడంతో మంగళవారం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.

ఆమెను విచారించాలి...

ఈ కేసులో ఆమెను విచారించాలని పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చింది. ఈ సినిమా హక్కులు తమకు ఇవ్వాలనే ఒప్పందంపై సినిమా ప్రమోషన్ల కోసం లతకు రూ.14.9 కోట్లు ఇచ్చామని, అయితే, సినిమా హక్కులు తమకు ఇవ్వలేదని సదరు సంస్థ పేర్కొంది. కొంత డబ్బును తమకు తిరిగి ఇవ్వగా, ఇంకా రూ.6.2 కోట్లు బకాయి ఉన్నారని తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు తప్పుగా వార్తలు ప్రసారం చేశాయని రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య తాజాగా ట్విట్టర్ ద్వారా ఆరోపించారు.

Similar News