తెలుగు ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చిన సూపర్ స్టార్..!

Update: 2018-12-19 08:13 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ - త్రిష - సిమ్రాన్ జంటగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన పెట్టా సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతుంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న పెట్టా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రజనీకాంత్ గత చిత్రాల ఫలితం ఈ సినిమా బిజినెస్ మీద ఏ మాత్రం పడడం లేదు. అందుకే రజనీకాంత్ ని సూపర్ స్టార్ అంటారు. ఇక సంక్రాతి రేసులో ఉన్న పెట్టా చిత్రం తమిళనాట పెద్ద సినిమాలకు దడ పుట్టిస్తుంది. అజిత్ విశ్వాసం కూడా సంక్రాంతికే రిలీజ్ అన్నారు కానీ.. ఆ సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ పెట్టా మాత్రం ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంది.

పోటీ ఎక్కువ ఉన్నందున వాయిదా

ఇక రజనీకాంత్ సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతాయి. రజనీకి తెలుగులో కూడా మంచి మర్కెట్ ఉంది. తాజాగా పెట్టా హక్కులని నిర్మాత సి.కళ్యాణ్ చేజిక్కించుకున్నాడు. అయితే తెలుగులో ఈ సంక్రాంతికి రామ్ చరణ్ వినయ విధేయ రామ, బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్, దిల్ రాజు ఎఫ్ 2 చిత్రాలు గట్టి పోటీకి ఉన్నాయి. అయితే భారీ సినిమాలు రిలీజ్ అవడం తెలుగు నిర్మాతలు చాలా థియేటర్స్ ని బ్లాక్ చెయ్యడంతో.. పెట్టాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టమని వాయిదా వేశారట. సి.కళ్యాణ్ ఫ్యాన్సీ రేటుకు పెట్టా హక్కులను దక్కించుకోవడంతో సంక్రాంతికి పోటీ పెడితే కష్టమని భావించి పెట్టా విడుదల వాయిదా వేశారట. అయితే తమిళంలో మాత్రం అనుకున్న సమయానికే విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Similar News