స్టార్ మహిళ ఇక రాదు..!

Update: 2018-08-17 07:12 GMT

టాలీవుడ్ లో యాంకర్స్ అందరిలో ఒక మెట్టు పైనే ఉంటుంది యాంకర్ సుమ. కేరళ అమ్మాయిగా టాలీవుడ్ కొచ్చిన సుమ తెలుగు వాళ్లు కూడా స్పష్టంగా మాట్లాడ లేని తెలుగుని ఎంతో అందంగా మాట్లాడుతూ తనదైన ముద్రవేసింది. అసలు సుమ కేరళ అమ్మాయంటే ఎవరూ నమ్మరు. అచ్చ తెలుగు అమ్మాయి అంటేనే అందరూ ఇట్టే నమ్మేస్తారు. ఒక షోకి యాంకరింగ్ చెయ్యనివ్వండి.. ఒక ఆడియో లాంచ్ కానివ్వండి, ఒక ప్రెస్ మీట్, ఒక అవార్డు ఫంక్షన్, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి... ఏ ఈవెంట్ అయినా తన మాటకారి తనంతో తన స్టైలిష్ యాంకరింగ్ తో అదరగొట్టేస్తుంది.

యాంకరింగ్ లో రికార్డు...

ఇక ఈటివి ఛానల్ కి సుమ యాంకరింగ్ అంటే మహా ఇష్టం అందుకే.. ఈటివిలో ఏ పెద్ద ప్రోగ్రాం అయినా.. సుమ చేతిలో పడాల్సిందే. క్యాష్ అయినా జీన్స్ అయినా స్వరాభిషేకం అయినా సుమనే యాంకరింగ్ చెయ్యాలి. ఇక ఈటీవీలో గత 12 ఏళ్లుగా స్టార్ మహిళా ప్రోగ్రాంలో తనదైన యాంకరింగ్ తో మహిళలకు గంటసేపు ఎనలేని ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సుమ ఈ ప్రోగ్రాంతో... లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించింది. కొంతమంది మహిళలతో గంటసేపు ఆటపాటలతో స్టార్ మహిళతో సుమ మహిళా ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. కేవలం తన వాక్చాతుర్యంతో.. సుమ ఎవరికీ ఏ క్షణంలోను బోర్ కొట్టించకుండా అందరిని మెస్మరైజ్ చేసే ఎంటర్టైన్మెంట్ తో అందరి మనసులను కొల్లగొట్టింది.

త్వరలో గ్రాండ్ ఫినాలె...

అయితే గత 12 ఏళ్లుగా స్టార్ మహిళని ఏకచత్రాధిపత్యంగా నడిపిస్తున్న యాంకర్ సుమ ఇప్పుడు స్టార్ మహిళకు బై బై చెప్పేస్తుంది. ఈటివి ఛానల్ వారు స్టార్ మహిళను ఆపేస్తున్నట్లుగా సుమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దాదాపుగా మూడు వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న స్టార్ మహిళా ఇక ఈటివి ఛానల్ లో రాదు. అయితే ఈ ప్రోగ్రాం ని ఆపేస్తున్నట్లు ప్రకటించిన సుమ స్టార్ మహిళా గ్రాండ్ ఫినాలే కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. మీమీ అభిప్రాయాల్ని వీడియో రూపంలో పంపితే ప్రసారం చేస్తామని సోషల్ మీడియా ద్వారా చెబుతుంది. మరి స్టార్ మహిళ ద్వారా ఎంతోమంది మహిళలు గేమ్ షోస్ లో ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ స్టార్ మహిళని విజయవంతం చేశారు. ఇప్పడు ఈ ప్రోగ్రాం ఆగిపోవడం మహిళలకు బాధ కలిగించే విషయమే. అయినా తప్పదు.

Similar News