శ్రీకాంత్ కి శర్వా దొరికాడా..?

Update: 2018-09-18 06:23 GMT

'బ్రహ్మోత్సవం' సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో మహేష్ తో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ అద్దాల డిప్రెషన్ లోకి వెళ్లారు. కొన్ని రోజులు తర్వాత మహేష్ అవన్నీ మర్చిపోయి తన సినిమాలతో బిజీ అయ్యిపోయాడు కానీ శ్రీకాంత్ మాత్రం అందులో నుండి త్వరగా బయటికి రాలేకపోయాడు. దాదాపు ఏడాది పాటు అతడికి మరో అవకాశమే దక్కకపోవడంతో కొంత కాలం హైదరాబాద్ వదిలేసి సొంతూరికి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయాడు. అయితే ఎట్టకేలకు అల్లు అరవింద్ పిలిచి సినిమా చేద్దాం అని చెప్పడంతో తిరిగి హైదరాబాద్ కి వచ్చాడు. కానీ ఆ సినిమా ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అన్న అనుమానాలు ముసురుకుంటున్న టైంలో ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. దసరా రోజు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేయనున్నారు.

ఈ సినిమాతోనైనా..?

శర్వానంద్ ఇందులో హీరోగా నటించనున్నాడు. శర్వా ఇందులో విద్యార్థి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. నిజానికి అద్దాల... అల్లు శిరీష్ తో సినిమా చేయాలని అనుకున్నాడు గానీ ఇద్దరికీ సరైన మార్కెట్ లేకపోవడంతో రిస్క్ అని తెలుసుకుని ఆ ప్రాజెక్ట్ ను శర్వానంద్ తో చేయమని సూచించాడట అరవింద్. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని చెబుతున్నారు. అరవింద్ కి కథ నచ్చడంతో ‘బ్రహ్మోత్సవం’ రిజల్ట్ ని పక్కన పెట్టేసి మరీ ప్రొడ్యూస్ చేస్తున్నాడట. పాపం శ్రీకాంత్ అద్దాల ఈ సినిమాతో అయినా కం బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం.

Similar News