చైతు ప్రేమలో నలిగిపోవడం ఖాయం..!

Update: 2018-08-31 08:09 GMT

నాగ చైతన్య - అను ఇమ్మాన్యువల్ - రమ్యకృష్ణ కాంబోలో విడుదలకు సిద్దమవుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాని దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. దర్శకుడు మారుతీ అనుకున్న కథకి కామెడీని జొప్పొంచి సినిమాని నడిపించ గల సత్తా ఉన్న దర్శకుడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల కంటెంట్ లోని కామెడీకి ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయ్యాడు. తాజాగా శైలజ రెడ్డి అల్లుడు సినిమాని కూడా మారుతీ పక్కా కామెడీ ఎంటెర్టైనెర్ గానే తెరకేకించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ట్రైలర్ లో నాగ చైతన్య క్లాస్ లుక్ లో అదరగొడుతుంటే.. అను ఇమ్మాన్యువల్ అందమైన అమ్మాయిలా... ఈగోయిస్టు గా కనబతుంది. ఇక రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో ఇరగదీసింది.

ఆకట్టుకుంటున్న ట్రైలర్

నా పేరు చైతన్య అంటూ నాగ చైతన్య వాయిస్ ఓవర్ తో మొదలైన శైలజ రెడ్డి అల్లుడులో చైతు దేన్నయినా లైట్ గా తీసుకునే పాజిటివ్, సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు... కాదు కాదు చెబుతున్నాడు. మనం లైఫ్ లో తీసుకొనే ప్రతిదాని వెనుక ఒక కష్టం ఉంటుంది... అది మనం తట్టుకోగలిగితే లైఫ్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది... అలాగని దేవుడు నా లైఫ్ ని సాఫ్ట్ గా పోనివ్వడు కదా... అందుకే పుట్టినప్పుఫుడు ఒకరిని డాడీ(మురళి శర్మ) రూపంలోనూ, ప్రేమించడానికి ఒకరిని అను(అను ఇమ్మాన్యువల్) రూపంలోనూ... పెళ్లి జరగడానికి ఒకరిని అత్త (రమ్యకృష్ణ) రూపంలోనూ ఇచ్చి గట్టిగా తొక్కేసాడంటూ ఫన్నీ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ లో అనుతో ప్రేమ, ఈగో, తండ్రి మురళి శర్మతో తిట్లు, అత్త రమ్యకృష్ణ కోపానికి బలయ్యే ప్రేమికుడు... అలాగే కామెడీతో కూడిన డైలాగ్స్, సీనియర్ నరేశ్, పృథ్వీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ కామెడీ పంచులు, శైలజ రెడ్డి, అనుల మధ్య తల్లి కూతుళ్ల అనుబంధం... అలాగే అంతకుమించి ఈగో ప్రోబ్లమ్స్, మధ్యమధ్యలో నాగ చైతన్య వేసే ప్లాన్స్ అన్ని కూడా సినిమా మీద ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే.. సినిమా మొత్తం కుటుంబ కథా చిత్రంగా కనబడుతుంది. ఇక చారి పాత్రలో వెన్నెల, మాణిక్యం పాత్రలో పృధ్వీ కామెడీ బాగా వర్కౌట్ అయ్యేలాగా కనబడుతుంది. ఇక ట్రైలర్ చివరిలో రమ్యకృష్ణ చెప్పిన నాలాగే నీకూ ఈగో ఎక్కువని విన్నాను.. దాని దమ్మేంటో చూడాలని ఉంది అనే పవర్ ఫుల్ డైలాగ్ చూస్తుంటే మాత్రం రమ్యకృష్ణ మరోసారి పిచ్చెక్కించడం ఖాయంగా కనబడుతుంది.

సాంకేతిక వర్గం ప్లస్ అవుతుందా..?

ఇంకా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ తో పాటుగా.. మారుతీ కథ, కామెడీ, డైరెక్షన్, అలాగే గోపి సుందర్ మ్యూజిక్ తో పాటుగా నేపథ్య సంగీతం కూడా ప్లస్ అయ్యేలా ఉన్నాయి. మరి ఇప్పటివరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న శైలజ రెడ్డి అల్లుడు ట్రైలర్ తో సినిమా మీద మరింత అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమాతో నాగ చైతన్య గట్టిగా కొట్టేలాగే కనబడుతున్నాడు.

Similar News