సంజన చెప్పిందే నిజమైంది..?

Update: 2018-06-25 07:11 GMT

ఇప్పుడు బుల్లితెర మీద హాట్ టాపిక్ ఏంటయ్యా అంటే.. బిగ్ బాస్ సీజన్ 2 అనే చెప్పాలి. నాని హోస్టింగ్ లో గత పదిహేను రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ని ఫర్వాలేదనిపించేలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షోలో మసాలా కంటెంట్ బాగానే మొదలైంది. గత శుక్రవారం తనీష్, నూతన నాయుడు, సామ్రాట్, కౌశల్, తేజస్విని మధ్యన గొడవ పీక్స్ కి వెళ్లింది. అలాగే కెప్టెన్సీ టాస్క్ విషయంలోనూ కిరీటి .. కౌశల్ ని అవమానించేలా మట్లాడడం.. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. అయితే శనివారం బిగ్ బాస్ షోని నాని చాలా చక్కగా నడిపించి అందరి మధ్యలో సయోధ్య కుదిర్చినట్లుగా కనబడుతుంది. కానీ ఆదివారం జరిగిన ఎలిమినేషన్ చూస్తుంటే మాత్రం కాస్త ఆశ్చర్యంగా, కాస్తంత అనుమానం కలిగించేలా అనిపించింది అనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది.

వారి కంటే మేలుగానే...

గత సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియలో దీప్తి సునయన, కౌశల్, గణేష్, నూతన నాయుడు, బాబు గోగినేని నామినేట్ అయ్యారు. అయితే ఈ షో మొదలైనప్పుడే కామన్ మ్యాన్ గా ఎంటరైన సంజన, నూతన నాయుడు, గణేష్ లు సెలబ్రిటీలతో బాగానే కలిసిపోయినా... సంజన మాత్రం అవకాశం ఉన్నప్పుడల్లా కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడింది. కేవలం మాట్లాడడమే కాదు షో నుండి ఎలిమినేట్ అయ్యేవరకు తెచ్చుకుంది. ఇక షో నుండి ఎలిమినేట్ అయిన సంజన ఛానళ్లకు ఎక్కి బిగ్ బోస్ షో బూటకమని.. షోలో కామన్ మ్యాన్స్ కి చోటు లేదని నా తర్వాత గణేష్ లేదా నూతన నాయుడు బయటికొచ్చేస్తారు చూడండి అంటూ ఛాలెంజ్ చేసింది. మరి నిజంగా సంజన చెప్పినట్టుగానే ఆదివారం రాత్రి అనుకోకుండా నూతన నాయుడు షో నుండి సెకండ్ ఎలిమినేటర్ అయ్యాడు. మరి షోలో కిరీటి, బాబు గోగినేని, గణేష్, రోల్ రైడా వంటి వారు అస్సలు పని చెయ్యకుండా బిగ్ బాస్ షో కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించలేకపోతున్నారు. మరి వారిని కాదని నూతన్ నాయుడు ఎలిమినేట్ అవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

నూతన్ నాయుడు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు...?

కాకపోతే మా చేతుల్లో ఏం లేదు.. అంతా ప్రేక్షకులే చేసారంటూ. నాని కూడా అంతా ప్రేక్షకుల మీద కి తోసెయ్యడం.. చూస్తుంటే మాత్రం అందరిలో ఏదో అనుమానం మొదలైంది. నూతన్ నాయుడు మరీ అంత తీసేసేలా షోలో ఏం చేయలేదు. ఆయనవరకు అయన టాస్క్ లలో మంచి పెరఫార్మెన్సు ఇచ్చాడు. మరి నాని కూడా ఏదైనా జరగొచ్చు అంటూనే... ‘కౌశల్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. కానీ కెప్టెన్సీ టాస్క్ లో కిరీటి తో జరిగిన గొడవతో అతడు రాత్రికి రాత్రే హీరో అయిపోయి... ఎలిమినేషన్ నుండి తప్పించుకుని సేఫ్ అయ్యాడు. ఇక కౌశల్ ప్లేస్ లో నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడంటూ’ చెప్పడం కూడా కాస్తంత హాస్యాస్పదమే. చూద్దాం 15 రోజులకే ఇలా ఉంటే.. మిగతా 90 రోజుల షోలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Similar News