వర్మకు అదే పెద్ద కామెడీనా?

Update: 2018-12-13 07:04 GMT

మూవీ రాడిక‌ల్ రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు బాల‌య్య బాబుతో ఢీ అంటున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తున్న బాల‌య్యకు పోటీగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాకు ద‌స‌రా పండుగ రోజున త‌న స‌ర‌దా ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టేశాడు. ఇక మూవీ స్టోరీ లైన్ ఏంటో ట్వీట్ చేసిన వ‌ర్మ ఇప్పుడు నంద‌మూరి కుటుంబంలో కొత్త టెన్ష‌న్ కు బీజం వేశాడు. ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చింది మొద‌లు వారిద్ద‌రి పెళ్లి దాకా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను పూస గుచ్చిన‌ట్లుగా, య‌ధాత‌థంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు వ‌ర్మ డిక్లేర్ చేశాడు. అంటే ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర రాయ‌డానికి లక్ష్మీపార్వ‌తి ఎలా నంద‌మూరి ఇంట్లో అడుగు పెట్టిందీ... అన్న‌గారితో పెళ్లి త‌ర్వాత కుటుంబ స‌భ్యులు ఎలా ఎన్టీఆర్ ను దూరం పెట్టారు... వైస్రాయ్ ఎపిసోడ్... ఇలా హిస్టారిక‌ల్ మూమెంట్స్ అన్నింటికీ త‌న మార్క్ మాస్ మ‌సాలా జోడించనున్నారు వ‌ర్మ‌. మామూలుగా వ‌ర్మ సినిమాలంటే జ‌నం ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ అనుకోవ‌డం ఆన‌వాయితీ.

నటీనటులెవరు....?

పోనీలే ఏదో ఫ్యాక్ష‌నిజం, బెజ‌వాడ హ‌త్యా రాజ‌కీయాలే క‌దా అని స‌రి పెట్టుకున్న‌ జ‌నం... ఇప్పుడు ఏకంగా అన్న గారి జీవితాన్ని వ‌ర్మ టార్గెట్ చేయ‌డంపై టెన్ష‌న్ ప‌డుతున్నారు. వెరైటీ పాట‌తో జ‌నంలో కిక్కెక్కించే వ‌ర్మ‌... డైలాగులు, స‌న్నివేశాలు, ఆర్టిస్టుల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ వేషం ఎవ‌రితో వేయిస్తారు, ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర ఎవ‌రు పోషిస్తారు, ఎన్టీఆర్ జీవితంలో కీల‌క‌మైన వ్యక్తి చంద్ర‌బాబు నాయుడిగా ఇంకెవ‌రు న‌టిస్తారు అన్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎదుటోడు ఏడుస్తుంటే కామెడీ చేసుకునే వ‌ర్మ‌కు మొద‌ట కావాల్సింది నంద‌మూరి కుటుంబం నుంచి రియాక్ష‌న్.

వర్మకు టైంపాస్....

వారు ఎంతలా రియాక్ట్ అయితే... వ‌ర్మ‌కు అంత టైం పాస్. వాళ్లు తిట్టినా, వార్నింగ్ ఇచ్చినా వ‌ర్మ‌కు పండ‌గే పండ‌గ‌. ల‌క్ష్మీ పార్వ‌తి నుంచి మాజీ హీరో గ‌డ్డం చ‌క్ర‌వ‌ర్తి ద్వారా వివ‌రాలు తెప్పించుకున్న వ‌ర్మ‌... వాటిని ఉన్న‌తి ఉన్న‌ట్లుగా ప్ర‌జెంట్ చేస్తారా, త‌న పైత్యం జోడించి అన్న‌గారి ప‌రువు తీస్తారా అన్న‌దే మ‌రో ముఖ్య‌మైన పాయింట్. మొత్తానికి రాంగోపాల్ వ‌ర్మ తాజా ప్రాజెక్ట్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి చివ‌ర్లో రిలీజ్ చేస్తాన‌ని వ‌ర్మ డిక్లేర్ చేశాడు. అంటే చ‌లికాలంలో జ‌నంలో హీట్ పుట్టించ‌డ‌మే వ‌ర్మ ఉద్దేశం. ఇక ఎవ‌రు తిట్టినా, చీ అన్నా, థూ అన్నా డోంట్ కేర్ పాల‌సీతో బ‌తికేస్తున్న వ‌ర్మ బుర్ర‌లో ఎన్టీఆర్ ఎలా కొలువై ఉన్నాడ‌న్న‌ది అప్పుడే తేల‌నుంది.

Similar News