రజినీతో అప్పుడు మిస్ అయ్యాడు కానీ ఇప్పుడు కాదు!

Update: 2018-05-20 11:05 GMT

సినిమాటోగ్రాఫర్ తిరునావుక్కరసు అలియాస్ తిరు 'జనతా గ్యారేజ్’తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' సినిమాకి కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్. తమిళంలో సూర్య '24 ' సినిమాకి ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డు కూడా అనుదుకున్నాడు తిరు.

తమిళ్, తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్నో భారీ చిత్రాలకు పని చేసిన తిరు.. ఇప్పుడు ఓ స్పెషల్ మూవీలో అవకాశం అందుకున్నాడు. తమిళంలో రజినీకాంత్ హీరోగా యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించబోయే సినిమాకు తిరునే సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు. గతంలోనే తిరు రజినితో సినిమా చేయాల్సవుంది. రజినీ కెరీర్లో అతి పెద్ద సినిమాగా నిలిచిన ‘రోబో’కు ముందు ఛాయాగ్రాహకుడిగా అనుకున్నది తిరునే.

కానీ బాలీవుడ్ లో కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఆ ఆఫర్ ని వదులుకున్నాడు. దీంతో అవకాశం రత్నవేలును వరించింది. ఇప్పుడు ఎట్టకేలకు రజనీతో సినిమా చేయబోతుండటంపై తిరు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బేనర్ నిర్మిస్తోంది. పాలిటిక్స్ లోకి వెళ్లేముందు రజనీ చేయబోయే చివరి సినిమా ఇదే. వచ్చే నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గతంలో ‘పిజ్జా’, ‘జిగర్ తండ’, ‘ఇరైవి’ లాంటి క్లాసిక్స్ తీశాడు. లేటెస్ట్ గా ఇతను ‘మెర్క్యురీ’ అనే సైలెంట్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు.

Similar News