ఇక్కడ ఓకె... కానీ అక్కడే..?

Update: 2018-05-10 04:22 GMT

మహానటి సినిమా ఓవర్సీస్ లోను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలై సంచలన విజయాన్ని మూటగట్టుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సినిమా ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించాడు. సావిత్రి చిన్ననాటి పరిస్థితులనుండి.... ఆమె సినిమా ప్రపంచాన్ని, నిజ జీవితాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. అందులోను సావిత్రి నట జీవితం అందరికి తెలిసినా... ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు మహానటిలో నాగ్ అశ్విన్ సావిత్రి వ్యక్తిగతం చాలా ఆసక్తికరమైన సంగతులు ప్రపంచానికి తెలియజెప్పాడు. ఇక మహానటిగా ఒక వెలుగు వెలిగిన సావిత్రి పతనం కావడం వెనుక ఆమె భర్త జెమిని గణేశన్ ఉన్నాడనే నిజాన్ని నాగ్ అశ్విన్ ఎవరికీ భయపడకుండా సినిమాలో చూపించాడు. సావిత్రి చివరి దశలో అలా కావడానికి జెమిని గణేశన్ కారణమని చెప్పాడు.

అయితే నాగ్ అశ్విన్ తాను చెప్పదల్చుకున్నది చాలా సూటిగా.. సావిత్రి మీద పూర్తి సాఫ్ట్ కార్నెర్ ఉన్నట్టుగా చూపించాడు.. అలా సావిత్రిని మంచిగా చూపించిన దర్శకుడు జెమిని గణేశన్ ని విలన్ ని చేసినాడు. నాగ్ అశ్విన్ విలన్ చెయ్యడమేమిటి నిజంగానే సావిత్రి జీవితానికి శాపం జెమినీనే. కానీ అది ఒప్పుకోవడానికి అయన మొదటి భార్య పిల్లలు సిద్ధంగా ఉంటారా..? తమ తండ్రి పాత్రని ఇలా విలన్ గా మహానటి లో చూపించడం అనేది వారికీ నచ్చుతుందా? జెమిని గణేశన్ కి పెద్ద భార్య ద్వారా నాలుగు కూతుళ్లు, సావిత్రికి ఒక అబ్బాయ్, అమ్మాయి, అలాగే జెమిని కి మరో స్త్రీ ద్వారా బాలీవుడ్ హీరొయిన్ రేఖతో పాటు మరో అమ్మాయి రాధ కూడా ఉన్నారు. మరి రేఖ, రాధాలు జెమిని విషయంలో లైట్ తీసుకున్నా... సావిత్రి గారి పిల్లలు తన తల్లి విషయంలో మంచే జరిగిందని ఊరుకున్నప్పటికీ.. జెమిని పెద్ద భార్య పిలల్లు మాత్రం ఊరుకుంటారా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మెదులుతుంది.

మరి జెమిని గణేశన్ కి తెలుగులో కన్నా తమిళ్ లో ఎక్కువ పాపులారిటీ ఉంది. రేపు మహానటి సినిమా కోలీవుడ్లోనూ విడుదలకానుంది. మరి తెలుగు విడుదలలో ఈ విషయంలో సమస్యలేమీ రానప్పటికీ... కోలీవుడ్ వెర్షన్ రిలీజ్ తర్వాత ఎమన్నా సమస్యలు మహానటిని చుట్టుముడతాయేమో అనే అనుమానంలో చాలామందే ఉన్నారు. కేవలం జెమిని పెద్ద భార్య కూతుళ్లే కాదు... కోలీవుడ్ ఫాన్స్ కూడా ఈ విషయంలో అభ్యంతరాలు పెట్టే సూచనలు కనబడుతున్నాయి. చూద్దాం రేపు మహానటి విషయంలో కోలీవుడ్ లో ఏం జరగబోతుందో అనేది.

Similar News