ఎన్టీఆర్ బయోపిక్ పేరు మారింది

Update: 2018-10-04 06:48 GMT

నందమూరి తారక రామారావు అనే పేరు నటనకే ఆణిముత్యం. నట జీవితంలో అనేక రకాల పాత్రలతో మెప్పించిన నందమూరి తారకరామారావు బయోపిక్ ని ఆయన తనయుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే నట, రాజకీయ జీవితంలో సంచలనాల ఎన్టీఆర్ జీవితాన్ని ఒకే ఒక భాగంలో చూపించడం అనేది అసాధ్యం. అయితే సినిమా మొదలు పెట్టినప్పుడు ఒకే భాగంగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ అనుకున్నాడు. కానీ అది అసాధ్యం అని తేలడంతో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ పూర్తి నట జీవితం ఒక భాగంగా, ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మరో భాగంగా తీర్చి దిద్దుతున్నారు. గత రెండు రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరుగుతుండగా... తాజాగా ఎన్టీఆర్ చిత్ర బృందం నుండి కూడా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది.

రెండు పార్ట్ ల మధ్య రెండు వారాలు...

ఎన్టీఆర్ నట జీవితాన్ని మొదటి భాగంగా ఎన్టీఆర్ - కథానాయకుడు గా, ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంగా ఎన్టీఆర్ - ప్రజానాయకుడు గా విడుదల చెయ్యాలని క్రిష్ తో పాటుగా బాలకృష్ణ కూడా భావించి ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నామని బిగ్ బ్రేకింగ్ న్యూస్ లా ప్రకటించేశారు. మరి నటజీవితంలో కథానాయకుడిగా ఎన్టీఆర్ చేసిన పౌరాణిక పాత్రలు, హీరోయిజాన్ని పండించే పాత్రలు, ఆత్మీయతలు, అనుబంధాలకు అల్లుకుపోయే పాత్రలు ఎన్టీఆర్ కి పెట్టింది పేరు. ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, ఇంకా చాలా రకాల పాత్రలు అలవోకగా వేసి అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ఇక ఏఎన్నార్, కృష్ణ, ఎస్వీఆర్, సావిత్రి, శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇలా మేటి నటీనటులతో ఎన్టీఆర్ తన నట జీవితంలో జీవించారు. ఎన్టీఆర్ నట జీవితాన్ని అందుకే క్రిష్ కథానాయకుడిగా చూపించబోతున్నాడు. ఇక మిగిలిన ప్రజానాయకుడు గా అంటే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కూలంకషంగా చూపించబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ - కథానాయకుడు పార్ట్ ని జనవరి 9 న సంక్రాతి కానుకగా విడుదల చేసేటున్నారని అధికారిక ప్రకటన ఇవ్వగా... ఎన్టీఆర్ - ప్రజానాయకుడు పార్ట్ ని దీనికి రెండు వారాల గ్యాప్ తో జనవరి 26 న విడుదల చేసే ప్లాన్ లో ఎన్టీఆర్ చిత్ర బృందం ఉంది కానీ.. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ కి సంబంధించిన ఎన్టీఆర్ - కథానాయకుడు పోస్టర్ ని విడుదల తేదీతో పాటుగా విడుదల చేశారు.

Similar News