ఎన్టీఆర్ బయోపిక్ హీరోయిన్ ఎవరంటే...?

Update: 2018-06-09 08:10 GMT

బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్ చేతుల్లో పెట్టాడు. క్రిష్ కూడా బాలీవుడ్ లో మణికర్ణిక షూటింగ్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ లోకి దూకేసాడు. క్రిష్ మామూలుగానే పక్కా స్క్రిప్ట్ తో సినిమా షూటింగ్ ని పరుగులు పెట్టించడమే కాదు.. అనుకున్న టైం కి అనుకున్నట్టుగా సినిమాని విడుదల చేసి చూపించ గల సత్తా ఉన్న డైరెక్టర్. గతంలో బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక చిత్రాన్ని ఆఘమేఘాల మీద పూర్తి చేసి బాలకృష్ణ అనుకున్న సంక్రాతి టార్గెట్ కి రీచ్ అయ్యాడు. ఇక ఇప్పుడు కూడా క్రిష్ - బాలకృష్ణ ల ఎన్టీఆర్ బయోపిక్ చకచకా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

విద్యాబాలన్ ఫిక్స్....

అందుకే ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం కాస్టింగ్ సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే నటీనటుల కోసం ప్రకటన ఇచ్చిన క్రిష్ ఇప్పుడు ఎన్టీఆర్ వైఫ్ బసవతారకం క్యారెక్టర్ కోసం హీరోయిన్ ఎంపిక పూర్తి చేసాడు. గతంలో వినిపించిన బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నే ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోయిన్ గా సెట్ చేసాడు క్రిష్. గతంలో అంటే తేజ ఎన్టీఆర్ బయోపిక్ ని హ్యాండిల్ చేసినప్పుడే విద్య బాలన్ అయితే బసవతారకం కేరెక్టర్ కి సెట్ అవుతుందని.. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ అప్పట్లో విద్య బాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్లుగా వార్తలొచ్చాయి. తన పాత్ర నిడివి ఎక్కువ ఉండాలని, అలాగే తన పాత్రకి ప్రాధాన్యత ఉండాలని ఇంకా ఏవేవో కండిషన్స్ పెట్టినట్లుగా ప్రచారం జరిగింది.

త్వరలోనే అధికారిక ప్రకటన...

తాజాగా క్రిష్ విద్యాబాలన్ ని సంప్రదించగా ఆమె ఎన్టీఆర్ బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ హీరో, విద్య బాలన్ హీరోయిన్. ఇక మిగతా నటీనటుల ఎంపిక కూడా త్వరలోనే పూర్తి చేసి అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య 50 నుండి 66 గెటప్స్ వరకు కనిపిస్తాడని ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది.

Similar News