దిల్ రాజుని నమ్ముకున్నా ఒరిగిందేమి లేదా..?

Update: 2018-08-10 07:19 GMT

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లై సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా లో మేఘ ఆకాష్ తో కలిసి నటించిన నితిన్ మళ్లీ.. తన తదుపరి సినిమా లోనూ మేఘ ఆకాష్ కి అవకాశం ఇచ్చాడు. ఈసారి త్రివిక్రమ్ కథ మీద నమ్మకంతో నితిన్.. కృష్ణ చైతన్య అనే కొత్త దర్శకుడితో ఛల్ మోహన రంగాలో సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా నటించాడు. కానీ సక్సెస్ కాలేదు.

యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న నితిన్

ఇక నాకు హిట్స్ పడడం లేదు.. హిట్ సినిమా కావాలంటే మీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని నితిన్.. దిల్ రాజు దగ్గరికి వెళ్లి అడగడంతో.. దిల్ రాజు, నితిన్ ని శతమానం భవతి తో హిట్ కొట్టిన సతీష్ వేగేశ్నకి అప్పగించాడు. మరి శతమానం భవతి సినిమాని కుటుంబాలకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంతో ఆ సినిమా హిట్ అయ్యింది. అలాగే సతీష్ వేగస్నా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అందుకే నితిన్ హీరోగా మళ్ళీ సతీష్ వేగేశ్న కుటుంబ కథా చిత్రాన్ని ఎన్నుకున్నాడు. పెళ్లి కాన్సెప్ట్ తో ఎన్ని కథలు తెరకెక్కినా.... తీసే విధానంలో కొత్తదనం ఉంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. మరి సతీష్ వేగేశ్న పెళ్లి కాన్సెప్ట్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాని భారీ తారాగణంతో కుటుంబ కథ చిత్రంగా మలిచాడు. నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా లో నితిన్ ని మరీ మంచి వాడిలా చూపెట్టడం.. అలాగే హీరోయిన్ రాశి ఖన్నా కూడా చూడగానే నితిన్ తో లవ్ లో పడిపోవడం.. కథలో బలం లేకపోవడం, ఎడిటింగ్ లో లోపాలు, ఇంకా ఈ సినిమా మొత్తం వెతికినా కామెడీ అనేది కనిపించకపోవడం.. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ చప్పగా ఉండడం ఇలా చాలా నెగెటివ్ పాయింట్స్ ఈ సినిమాలో కనబడ్డాయి.

దిల్ రాజును నమ్ముకున్నా...

ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే... నితిన్ నటనతో పాటు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలెట్ అనేలా ఉంది. దిల్ రాజు నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా కనబడుతున్నాయి. మరి క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి యావరేజ్ మార్కులే వేశారు. సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ చాలా పాత్రలు ఆలా వచ్చి వెళ్లిపోవడం, పెళ్లి గురించి మరీ సాగదీతగా చెప్పడం కూడా ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టే విషయమే అంటున్నారు. ఏది ఏమైనా శతమానం భవతి సినిమా అంత శ్రీనివాసుడి కళ్యాణం లేదని ప్రేక్షకుడి అభిప్రాయం. అంటే నితిన్ రెండు ఫ్లాప్స్ తర్వాత మళ్లీ యావరేజే కొట్టాడు. పాపం దిల్ రాజుని నమ్ముకున్నా నితిన్ కు పెద్దగా ఒరిగింది ఏమి కనబడడం లేదు.

Similar News