మహేష్ పరిస్థితినే విజయ్ కి కూడా..!

Update: 2018-10-06 10:28 GMT

నాలుగు సినిమాలతోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తమిళంలో కూడా పాగా వెయ్యాలనుకున్నాడు. పట్టుమని రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు పడగానే తమిళం మీద మోజు పుట్టడం సహజమే కానీ.. ఇంత త్వరగా తమిళంకి వెళ్లాలని ఆశపడడం మాత్రం తప్పే. ఇక్కడ స్టార్ హీరోలుగా ఉన్న చాలామంది హీరోలు తమిళంలోకి వెళ్లడానికి ఆలోచిస్తుంటే విజయ్ మాత్రం తనకున్న క్రేజ్ తో తమిళనాట కూడా విజయం సాధించాలని తహతహలాడాడు. తమిళంలో నటించిన సినిమాని తెలుగులో డబ్బింగ్ చెయ్యడం విజయ్ చేసిన పొరపాటు అనేది నోటా సినిమా టాక్ చెప్పకనే చెబుతుంది.

ఓపెనింగ్ బాగున్నా...

విజయ్ దేవరకొండ... ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో తమిళ డెబ్యూగా చేసిన నోటా నిన్న విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో విజయ్ తప్ప మరేదీ కూడా ప్రేక్షకుడికి రుచించే విధంగా లేకపోవడంతోనే ఆ సినిమాకి అలాంటి నెగటివ్ టాక్ వచ్చింది. నోటా ప్రీ రిలీజ్ కు ముందు ఉన్న క్రేజ్ వల్ల, విజయ్ స్టార్ క్రేజ్ వాళ్ల ఓపెనింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బాగానే వస్తున్నా వీకెండ్ అవ్వగానే డ్రాప్ చాలా దారుణంగా ఉండబోతోందని ట్రేడ్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది.

మహేష్ బాబు లాగానే...

ఇక నోటాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం చూసుకుంటే 50 శాతానికి పైగా నష్టం తప్పదనే లెక్కలు కూడా చెబుతున్నారు. అయితే తమిళ నేటివిటీ, తమిళ రాజకీయాలతో కూడిన ఈ నోటా పరిస్థితి తమిళంలో కొంచెం మెరుగ్గా ఉంది. అసలు పది సినిమాలు కూడా దాటకుండానే తమిళ ప్రేక్షకుల ముందు కూడా ప్రూవ్ చేసుకోవాలన్న ఆశతో ఉన్న విజయ్ కి నోటా దెబ్బేసింది. ఇక తమిళం కూడా నేర్చుకుని..అనర్గళంగా తమిళం మాట్లాడి అక్కడి ప్రేక్షకులను పడేసాడు. కానీ తెలుగు ప్రేక్షకుల దగ్గర ఎంతో క్రేజ్ సంపాదించిన విజయ్. ఇప్పుడు వారి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నోటా డబ్బింగ్ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకులు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఎంతో క్రేజ్ ఉన్న మహేష్ బాబు 23 సినిమాల అనుభవం తర్వాత స్పైడర్ తో తమిళంలోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ తమిళనాట గొప్పగా పేరు తెచ్చుకోకపోగా... తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి కూడా మహేష్ లాగే అయ్యింది.

Similar News