ఈసారి విలన్ గా కాదు.. హీరోగానే...!

Update: 2018-11-06 07:12 GMT

ఎప్పుడూ తెలుగులో గెస్ట్ పాత్రల్లోనే మెరిసిన తమిళ హీరో మాధవన్ సవ్యసాచి సినిమాతో పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించాడు. ఆ సినిమాలో విలన్ గా మాధవన్ బాగానే ఉన్నప్పటికీ... దర్శకుడు చందు మొండేటి మాత్రం మాధవన్ ని ఎలా కావాలో అలా వాడుకోలేకపోయాడు. కాకపోతే ఒక స్టైలిష్ విలన్ పాత్రలో మాధవన్ బాగానే మెప్పించాడు. అయితే సవ్యసాచి సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో మాధవన్ గురించి పెద్దగా చర్చకు రాలేదు. సవ్యసాచితో తెలుగులోకి పూర్తిగా అడుగుపెట్టిన మాధవన్ ఇప్పుడు మరోసారి హీరోగా తెలుగు ప్రేక్షకుల చెంత చేరబోతున్నాడట.

తమిళ నిర్మాతలే రీమేక్ చేసేందుకు...

తమిళంలో మాధవన్ - విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన విక్రమ్ వేద సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆ సినిమాని తెలుగులో వెంకటేష్, రానాలు రీమేక్ చేస్తున్నారని.. అలాగే మరికొంతమంది హీరోలు ఈ సినిమాపై కన్నేశారనే ప్రచారం జరిగింది. అయితే విక్రమ్ వేద నిర్మాతలు మాత్రం రీమేక్ రైట్స్ గాని, డబ్బింగ్ రైట్స్ గాని తెలుగు దర్శక నిర్మాతలకు అమ్మలేదు. తాజాగా మాధవన్ హీరోగానే ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు విక్రమ్ వేద నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది.

హీరోలు వారే... దర్శకుడు మాత్రం...

తమిళంలో చేసిన పాత్రనే మాధవన్ తెలుగులో కూడా చేస్తాడని.. ఇక విజయ్ సేతుపతి కూడా సైరా వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు కాబట్టి.. తెలుగులో పరిచయం ఉంటుంది. అందుకే విజయ్ సేతుపతి కేరెక్టర్ ని విజయ్ సేతుపతి చేస్తాడని.. కానీ తమిళ విక్రమ్ వేద డైరెక్టర్ కాకుండా తెలుగులో ఈ సినిమాని స్వామి రారా డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించే అవకాశమున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో అనేది మాత్రం క్లారిటీ లేదు.

Similar News