‘సంజు’కి అండర్ వరల్డ్ డాన్ లీగల్ నోటీసులు

Update: 2018-07-27 07:43 GMT

సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా సంజు భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఇదే సమయంలో ఆ సినిమా చుట్టూ అనేక వివాదాలు కూడా ఏర్పడ్డాయి. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ ను మంచివాడిగా చూపించేందుకు ప్రయత్నించాడని పలువురు విమర్శలు చేస్తున్నారు. అయితే, తాజాగా అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం కూడా ఈ సినిమాపై అభ్యంతరం తెలిపాడు. తన అడ్వకేట్ తో సంజు సినిమా నిర్మాతకు లీగల్ నోటీసులు పంపించాడు.

జైళ్లో ఉండి నోటీసులు...

ఈ సినిమాలో సంజయ్ దత్ కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసింది అబూ సలేంగా చూపించారు. సంజయ్ పాత్రలో నటించిన రణబీర్ కపూర్ ఓ సన్నివేశంలో ఈ మాట చెబుతాడు. అయితే, తానేప్పుడూ సంజయ్ దత్ ను కలవలేదని, ఎటువంటి ఆయుధాలు అందించలేదని అబూ సలేం నోటీసులు పంపాడు. సినిమాలో నిరాధారమైన ఆరోపణలు నా క్లయింట్ అబూ సలేం పరువుకు భంగం కలిగిస్తున్నాయని న్యాయవాది ప్రశాంత్ పాండే చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపారు. అబూ సలేంకు ఆర్థిక పరిహారం ఇవ్వడంతో పాటు 15 రోజుల్లో ఈ సీన్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా రుజువు కావడంతో అబూ సలేంకు కోర్టు జీవితఖైదు విధించడంతో ప్రస్తుతం అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Similar News