మా నాన్న ను మిస్ అయ్యా

Update: 2018-05-28 07:38 GMT

మా నాన్న ... మా నాన్న అంటూ మహానటిలో తన పెదనాన్న ( రాజేంద్రప్రసాద్ ) ను అందరికి పరిచయం చేస్తూ అల్లరి చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సావిత్రి ( కీర్తి సురేష్ ) ఇప్పుడు ఆ నాన్నను మిస్ అయ్యాను అంటోంది. మహానటి సక్సెస్ మీట్ లో భాగంగా ఏపీలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న చిత్ర యూనిట్ తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఈ సందర్భంగా రాజమండ్రి వచ్చిన మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినప్పుడు, అలాగే రాజేంద్రప్రసాద్ పాత్ర అయిపోయాక ఆయన్ను చాలా మిస్ అయ్యానని చెప్పింది. రాజేంద్రప్రసాద్ నుంచి చాలా నేర్చుకున్నానని అవన్నీ తన కెరియర్ లో ఎంతో ఉపయోగపడతాయన్నారు కీర్తి. కెవి చౌదరి పాత్ర చిత్రీకరణ పూర్తి అయ్యాక కూడా రోజు నాన్న నాన్న అంటూ మెసేజ్ లతొ ఆయనతో గడిపిన సందర్భాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆ సీన్ నాకు సవాల్ విసిరింది ...

మహానటి చిత్రంలో కెవి చౌదరి పాత్రలో ఒదిగిపోయిన రాజేంద్రప్రసాద్.. చిత్రంలో ఒక సీన్ తన నటనకు సవాల్ విసిరిందన్నారు. సినిమా చివరిలో ఆసుపత్రిలో ఉన్న సావిత్రిని కలుసుకునే సన్నివేశం లో భావోద్వేగంతో కూడిన నటన చేయాల్సి వచ్చిందని, అది తనకెంతో నచ్చిందన్నారు. బాల సావిత్రి పాత్రలో తన మనుమరాలు నటనను అందరూ మెచ్చుకున్నారని చెప్పారు. తన మనమరాలు తనతో పోటీ పడి మరి తన క్యారెక్టర్ పండించడం పట్ల తాతగా ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఇక కెమెరామెన్ డానియెల్ అద్భుత సృష్టి, దర్శకుడు నాగ్ అశ్విన్ కృషి, నిర్మాతలైన అశ్వినీదత్ కుమార్తెల శ్రమ అన్ని కలిసి మళ్ళీ మహానటిని ప్రేక్షకుల గుండెల్లో నిలిపాయని అన్నారు. కమెడియన్ గా ప్రారంభించిన తన ప్రస్థానం హీరోగా ఎదగడం పై చెబుతూ లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు వంటి పాత్రలు హీరో కావని కానీ సామాన్య జనంలో తిరిగే ఇలాంటి పాత్రలను పడించడం వల్లే ఆ స్థాయికి వచ్చానని తన అనుభవాలు నెమరు వేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఇక నాగ్ అశ్విన్ క్యారెక్టర్ సినిమాలో జర్నలిస్ట్ అని, ఎంతో పరిశోధన చేసి సావిత్రి బయోపిక్ తో హిట్ కొట్టడాన్ని అభినందించారు.

Similar News