ఆ హీరోపై తెలుగు ద‌ర్శ‌కుల దృష్టి ప‌డ‌లేదేంటి?

Update: 2018-08-04 07:00 GMT

కార్తికేయ‌.... 'ఆర్.ఎక్స్‌.100' విడుద‌ల వ‌ర‌కు ఈ పేరు చాలా త‌క్కువ‌మందికి తెలుసు. ఆ సినిమా విజ‌య‌వంతం కావ‌డంతో ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తితో పాటు... హీరోహీరోయిన్లు కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చారు. ముగ్గురికీ స‌మానంగా పేరొచ్చింది. స‌హ‌జంగానే చిత్ర‌సీమ‌లో ఓ హిట్టొచ్చిందంటే అంతా వెంట‌ప‌డ‌తారు. ఈ సినిమా బృందం విష‌యంలోనూ అదే జ‌రిగింది. అజ‌య్ భూప‌తి కోసం క‌థానాయ‌కులు ఆరా తీశారు. కథ‌లేమైనా ఉంటే చెప్పు అని అడిగారు. క‌థానాయిక పాయ‌ల్ అయితే రెండు మూడు చిత్రాల‌కి ఇప్ప‌టికే సంతకం చేసేసింది. హీరో కార్తికేయ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. తెలుగు ద‌ర్శ‌కులు చెప్పుకోద‌గిన స్థాయిలో కార్తికేయ వైపు చూడ‌లేదు.

చైన్నై నుంచి వెతుక్కుంటూ వ‌చ్చారు...

అయితే విచిత్రంగా ఆయ‌న‌కి త‌మిళం నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. టి.ఎన్‌.కృష్ణ అనే ద‌ర్శ‌కుడు చెన్నై నుంచి వ‌చ్చి కార్తికేయ‌కి క‌థ చెప్పాడు. ఆ ద‌ర్శ‌కుడిని పంపింది కూడా ఎవ‌రో కాదు... క‌లైపులి ఎస్‌.థాను అనే ఓ పెద్ద నిర్మాత‌. త‌మిళ‌నాడులో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌వంటి స్టార్ల‌తో సినిమాలు తీసిన నిర్మాత ఆయ‌న‌. అలాంటి సంస్థ నుంచి ఆఫ‌ర్ వ‌స్తే ఎవ‌రు మాత్రం కాద‌నుకుంటారు? కార్తికేయ వెంట‌నే ఓకే చెప్పేశాడు. ఈ సినిమా రెండు భాష‌ల్లో రూపొందనున్న‌ట్టు స‌మాచారం. అయితే తెలుగు క‌థానాయ‌కుడైన కార్తికేయ‌పై తెలుగు ద‌ర్శ‌కుల దృష్టి కాకుండా, త‌మిళ ద‌ర్శ‌కుడి దృష్టి ప‌డ‌ట‌మే ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా ఉంది. రియ‌లిస్టిక్ క‌థ‌తో ఆర్‌.ఎక్స్‌.100 తెర‌కెక్కింది. ఇలాంటి క‌థ‌ల్ని త‌మిళ ప్రేక్ష‌కులు బాగా ఇష్ట‌ప‌డుతుంటారు. హీరో కార్తికేయ కూడా మాస్ అవ‌తారంలో, త‌మిళ క‌థానాయ‌కుల త‌ర‌హాలో క‌నిపించారు. అది కూడా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ని బాగా ఆక‌ట్టుకున్న‌ట్టుంది. అందుకే అక్క‌డి ద‌ర్శ‌కుడు నేరుగా వ‌చ్చి క‌థ చెప్పి కార్తికేయ‌ని ఒప్పించాడు. ఈ చిత్రం విష‌యంలో కార్తికేయ చాలా హ్యాపీగా ఉన్నాడు.

 

Similar News