కరణ్ సలహాతో సాహో డేట్ ఫిక్స్..?

Update: 2018-12-17 10:48 GMT

చాలా సాఫీగా.. కూల్ గా రోజులు గడుస్తున్నా కంగారు పడకుండా షూటింగ్ చేసుకుంటున్న సుజిత్ - ప్రభాస్ ల సాహూ చిత్రం ఎపుడు విడుదలవుతుందనేది అర్ధం కాక ప్రభాస్ ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. భారీ బడ్జెట్ తో పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే సాహో షూటింగ్ పూర్తయ్యి సినిమా విడుదలకు టైం ఎక్కువ పడుతుంది అనుకున్న ప్రభాస్... రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాని మొదలుపెట్టాడు. తాజాగా రాధాకృష్ణ.. ప్రభాస్ తో మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందని, సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల ఉంటుందని చెప్పాడు.

డేట్ లాక్ చేయమని చెప్పిన కరణ్

ఇక తాజాగా సాహో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. అది కూడా కరణ్ జోహార్ సలహా మేరకు సాహో విడుదల డేట్ ని నిర్మాతలు లాక్ చేశారట. సాహో సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల టార్గెట్ గా తెరకెక్కడంతో... తెలుగు, తమిళ భాషల్లో రెండు నెలల ముందు సినిమా విడుదల డేట్ ఇచ్చినా పర్లేదు కానీ.. హిందీలో అలా కాదు. చాలా సినిమాలు మొదలైనప్పుడే విడుదల డేట్ లాక్ చేసేస్తారు. మరి అప్పటికప్పుడు సాహో విడుదల అంటే హిందీలో చాలా పోటీ ఉంటుంది. అందుకే సాహో విడుదల డేట్ త్వరగా ప్రకటించమని కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ప్రభాస్ కి బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ సలహా ఇచ్చాడట.

ఒకే ఏడాది రెండు సినిమాలు...

కరణ్ జోహార్ సలహా మేరకు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్న సాహో చిత్రాన్ని 2019 ఆగష్టు 15న స్వాతంత్య దినోత్సవం రోజున విడుదలకు నిర్మాతలు డేట్ లాక్ చేసేసారు. మరి ప్రభాస్ రెండు చిత్రాలు 2019 ద్వితీయార్ధంలోనే సందడి చెయ్యబోతున్నాయి. ఒకే ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు.

Similar News