జయలలితగా సిల్క్ స్మిత..?

Update: 2018-06-16 08:05 GMT

ఇప్పడు అన్ని భాషల్లోనూ బయోపిక్స్ జోరు మాములుగా లేదు. బాలీవుడ్ లో బయోపిక్స్ ఎప్పుడో ఆదరణకు నోచుకున్నాయి. ఇక టాలీవుడ్ లోనూ మహానటి తో ఈ బయోపిక్స్ క్రేజ్ స్టార్ట్ అయ్యింది. మహానటి చలవతో అనేక బయోపిక్స్ తెర మీదకి తెచ్చే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక తమిళనాట కూడా ఈ రకమైన బయోపిక్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు మొదలైపోయాయి. గతంలో జయలలిత చనిపోయినప్పుడు అమ్మ బయోపిక్ అంటూ అనేకమంది హడావిడి చేసిన సంగతి తెలిసిందే. కానీ జయలలిత బయోపిక్ మాత్రం పట్టాలెక్కలేదు. అయితే మహానటి మూవీ విడుదలయ్యాక సావిత్రిగా మెప్పించిన కీర్తి సురేష్ జయలలిత కేరెక్టర్ లో అమ్మ బయోపిక్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఎన్టీఆర్ బయోపిక్ బ్యానర్ పైనే...

అయితే తాజాగా జయలలిత బయోపిక్ నిర్మించడానికి ఏర్పాట్లు మొదలైనట్లుగా తెలుస్తుంది. నటిగా, రాజకీయ వేత్తగా జయలలిత జీవితంలో తెలిసిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు అనేకానేకం ఉన్నాయి. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని... విష్ణు ఇందూరి (సిసిఎల్ సూత్రధారి) స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే విష్ణు ఇందూరి ఎన్టీఆర్ బయోపిక్ ని తన బ్యానర్ లో చేస్తున్నాడు. ఇక ఇపుడు జయలలిత బయోపిక్ కూడా తన బ్యానర్లో చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసాడు. అయితే జయలలిత బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయినదని.. ఇంకా జయలలిత పాత్రకు బాలీవుడ్ నటి డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి.

జయలలితగా విద్యాబాలన్...

మరి సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ లో విద్య బాలన్ కి విమర్శకుల సైతం బ్రహ్మరథం పట్టారు . మరి సిల్క్ స్మితగా అలరించిన విద్యాబాలన్ ఇపుడు జయలలితగా అటు నటిగా ఇటు పొలిటీషియన్ గా అంటే అమ్మగా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలయ్యింది. అయితే విద్య బాలన్ ని జయలలిత పాత్రకు ఎంపిక చేసినట్టుగా అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఫైనల్ గా విద్యా బాలన్ జయలలిత బయోపిక్ లో చేస్తుందనేది నిజమంటున్నారు.

Similar News