`మ‌హాన‌టి`లా నిలిచిపోయే హీరోయిన్లు మ‌న‌కు లేరా..?

Update: 2018-05-22 05:22 GMT

ఇటీవ‌ల 'మ‌హాన‌టి' టైటిల్‌తో మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను తెర‌కెక్కించారు. ఆమె జీవితంలో చ‌విచూసిన ఉత్థాన ప‌త నాల‌ను ద‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టి త‌రానికి సావిత్రిని, ఆమెలోనే ప్ర‌తిభ‌ను అద్భుతంగా చూపించారు. అంతా బాగుంది.. అంటూ అటు ఇండ‌స్ట్రీ, ఇటు సాధార‌ణ జ‌నం కూడా చ‌ప్ప‌ట్ల‌తో మోతెక్కించారు. క‌ట్ చేస్తే.. మ‌రి మ‌హాన‌టి వంటి న‌టీమ‌ణులు ఇప్పుడు ఈ త‌రంలో ఇక‌, ఎవ‌రున్నారు? మ‌హాన‌టిలా ఈ త‌రానికే కాకుండా మ‌రికొన్ని త‌రాల పాటు నిలిబ‌డే నాయిక‌లు లేరా? ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీలో నాయిక‌లు క‌నిపించ‌డం లేదా? మ‌హాన‌టి వంటి వారిని త‌యారు చేసేవారే క‌నిపించ‌డం లేదా? అంటే తాజాప‌రిణామాలు, ఇండ‌స్ట్రీలో ఉన్న వ‌ర్గ పోరు.. మ‌హాన‌టిల‌ను త‌యారు చేయ‌డంలో వైఫ‌ల్యాల‌నే మిగుల్చుతున్నాయి.

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో నాయిక‌లుగా, అగ్ర‌తార‌లుగా వెలుగొందిన వారు చాలా మందే ఉన్నారు. అంతేకాదు, హీరోతో స‌మానంగా పారితోషికాల‌ను డిమాండ్ చేసి తీసుకున్న నాయిక‌లు కూడా ఉన్నారు. వీరిలో ప్ర‌ధ‌మ వ‌రుస‌లో సావిత్రి, భానుమ‌తి, జ‌మున‌, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శార‌ద‌, శ్రీదేవి, వాణిశ్రీ, విజ‌య‌వాంతి, జ‌య‌ల‌లిత‌, భాను ప్రియ వంటి కీల‌క న‌టీమ‌ణులు నిలుస్తారు. అయితే, ఇది నాటి త‌రం. అప్ప‌ట్లో ద‌ర్శ‌కులు కూడా హీరోయిన్ల‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించేవారు. ఒక సినిమా హిట్ట‌యితే చాలు ఆమె చుట్టూ రెక్క‌లు క‌ట్టుకుని దీప‌పు పురుగుల్లా తిరిగేవారు.

ఇంకా చెప్పాలంటే శ్రీదేవి, జ‌య‌ప్ర‌ద లాంటి హీరోయిన్లు మ‌న తెలుగు వారు. వీళ్లు ఇక్క‌డ నుంచి నార్త్‌లో తిరుగులేని స్టార్లుగా ఎదిగి త‌ర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ స‌త్తా చాటి అక్క‌డ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ హీరోయిన్లు అయ్యారు. అలా 1980-90వ ద‌శ‌కం వ‌ర‌కు మ‌న తెలుగు హీరోయిన్లు న‌ట‌నా ప‌రంగా తిరుగులేకుండా ఉండ‌డంతో ఇత‌ర భాష‌ల హీరోలు, ద‌ర్శ‌కనిర్మాత‌లు సైతం తెలుగు హీరోయిన్ల‌పైనే మోజు చూపేవారు.

తెలుగు హీరోయిన్లు అందానికంటే న‌ట‌న‌కే ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశ‌వ్యాప్తంగా ఎన్నో సినిమా ఇండ‌స్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా న‌ట‌న అంటే తెలుగు హీరోయిన్లే గుర్తుకు వ‌చ్చేవారు. రంభ లాంటి హీరోయిన్ తెలుగు నుంచి కెరీర్ స్టార్ట్ చేసి సౌత్‌ను ఏలేసి నార్త్‌ను ఓ ఊపు ఊపేసింది. భోజ్‌పురిలో అయితే అప్ప‌ట్లో ఆమే స్టార్ హీరోయిన్‌. ఒక‌వేళ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా హీరోయిన్ల అభిన‌యానికి ప‌డ్డ మార్కుల ఆధారంగా వారిలోని ప్ర‌తిభ‌ను గుర్తించేవారు. అవ‌కాశం ఇచ్చేవారు. దాదాపు ప‌రాయి బాషా నాయిక‌ల కోసం పెద్ద‌గా దృష్టి పెట్టేవారు కాదు. ఫ‌లితంగా ద‌క్షిణాది తార‌లుగా త‌మకు ఎంతో గుర్తింపు తెచ్చుకోవ‌డంతోపాటు అభిమానుల గుండెల్లో గూడు క‌ట్టుకుని ఉండిపోయారు నాటి నాయిక‌లు!

కానీ నేడు ఈ విధంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా, వారి ఫొటోలు ఇళ్ల‌లో పెట్టుకుని ఆరాధించేలా ఉన్న ఓ న‌లుగురు తెలుగు నాయిక‌ల పేర్లు చెప్పండని ఎవ‌రినైనా అడిగితే.,. నోరు పెగ‌ల‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఓ సినిమా చేస్తే.. ఎక్కువ అనే రేంజ్‌లో ఇప్పుడు హీరోయిన్ల ప‌రిస్థితి దిగ‌జారిపోయింది. హీరోతో రెండు స్టెప్పులు, నాలుగు ఎక్స్‌పోజింగ్ సీన్ల‌కే వారిని ప‌రిమితం చేసేశారు. ఈ నేప‌థ్యంలో ఓ 25 ఏళ్ల త‌ర్వాత తెలుగు సినీ లోకాన్ని ఊపేసిన నాయిక‌పై సినిమా కాదుక‌దా.. డాక్యుమెంట‌రీ తీయాల‌న్నా.. ఆ అర్హ‌త ఉన్న నాయిక‌లు క‌నిపించ‌క‌పోవ‌డం ఇండ‌స్ట్రీ అలాంటి వారిని ప్రోత్స‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మొత్తంగా మ‌హాన‌టిలు ఇక లేన‌ట్టేన‌నే వ్యాఖ్య‌ల‌కు ఇలాంటి పోక‌డ‌లే బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. మ‌రో ప్ర‌ధాన విష‌యం.. తెలుగులో టాలెంట్ ఉన్న నాయిక‌లు ఉన్నారు. అంజ‌లి, శ్రీదివ్య లాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఉన్నా వారితో చేసేందుకు మ‌న స్టార్ హీరోలు అంగీక‌రించ‌రు. తెలుగు హీరోయిన్ల‌ను త‌మ సినిమాల్లో పెట్టుకుంటే త‌మ సినిమాల‌కు ఎక్క‌డ క్రేజ్ త‌గ్గిపోతుందో అన్న ఫీలింగ్ ఇటీవ‌ల ఎక్కువైపోయే జాడ్యం వ‌చ్చేసింది. త‌మ ప‌క్క‌న నార్త్ హీరోయిన్లే ఉండాలి...అందుకు వాళ్ల‌కు కోట్లు కోట్లు త‌గ‌లేయాలి..ఈ ఆలోచ‌న‌తోనే ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉంటున్నారు. ఏదేమైనా ఒక‌ప్పుడు దేశానికే ఆద‌ర్శ‌మైన తెలుగు హీరోయిన్లు ఇప్పుడు ఒక్క సినిమాలో అయినా వెండితెర మీద క‌న‌ప‌డ‌ని దుస్థితికి వ‌చ్చేశారు.

Similar News