కఠిన పరీక్షకి సిద్ధమయ్యారుగా...

Update: 2018-05-31 08:21 GMT

ఈ శుక్రవారం మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద యుద్దానికి సిద్ధమవుతున్నాయి. 'మహానటి' సినిమా తర్వాత మంచి సినిమానే థియేటర్స్ లోకి రాలేదు. అందుకే 'మహానటి' సినిమా కి ఇంతవరకు పోటీ లేకుండా పోయింది. అయితే ఈ శుక్రవారం మాత్రం మూడు పెద్ద సినిమాలే బరిలోకి దిగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కాంబోలో తెరకెక్కిన 'ఆఫీసర్' సినిమా పెద్దగా అంచనాలు లేకుండా వస్తోంది. అంచనాలు లేకుండా ఉండడానికి కారణం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మకి వరుస పరాజయాలు, అలాగే పవన్ కళ్యాణ్ మీద వర్మ చేసిన ఇండైరెక్ట్ వ్యాఖ్యలు, క్షమాపణలు ఇవన్నీ కూడా వర్మ 'ఆఫీసర్' సినిమా మీద జనాల్లో ఆసక్తి లేకుండా చేశాయి.

రాజుగాడు గట్టెక్కేనా...

మరోపక్క 'రంగుల రాట్నం' అంటూ ఈ ఏడాది మొదట్లోనే ప్లాప్ అందుకున్న రాజ్ తరుణ్.. సంజనా అనే కొత్త దర్శకురాలి దర్శకత్వంలో 'రాజుగాడు' అంటూ రేపు వస్తున్నాడు. అసలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎటువంటి ఆసక్తి లేదు. రాజ్ తరుణ్ క్రేజ్ అంతగా ఎక్కడా కనబడడం లేదు. వినబడడం లేదు. అందుకే 'రాజుగాడు' సినిమాపై పెద్దగా పబ్లిసిటీ కూడా రాజ్ తరుణ్ అండ్ టీమ్ ఖర్చు పెడుతున్నట్టుగా కనిపించడం లేదు. మరి రాజ్ తరుణ్ కి ఈ సినిమా విషమ పరీక్షే. ఈ సినిమా కూడా అటుఇటు అయితే రాజ్ తరుణ్ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే పరిస్థితి ఉంది.

తెలుగు ప్రజలు మెచ్చేనా...

ఇక ముచ్చటగా మూడో సినిమా 'అభిమన్యుడు'. కోలీవుడ్ హీరో విశాల్ - సమంత జంటగా నటించిన 'అభిమన్యుడు' సినిమా తమిళంలో 'ఇరుంబు తిరై' గా ఈ నెల 11 న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. మరి అక్కడ హిట్ అయిన 'అభిమన్యుడు' సినిమా ఇక్కడ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఏది ఎలాగున్నా ఈ మూడు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కఠిన పరీక్షను ఎదుర్కోబోతున్నాయి. మరి ఈ వారంలో ఈ మూడు సినిమాలు బతికి బట్టగడతాయో లేదో అనేది... కొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఇక ఈ సినిమాల్లో ఏవి హిట్ అయినా.. వచ్చే వారం రాబోయే 'కాలా' అని వస్తున్న రజినీకాంత్ విషమ పరీక్షని ఎదుర్కొని నిలబడగలగాలి.

Similar News