ఈ శుక్రవారం హీరోలేని సినిమా హిట్టయ్యింది..!

Update: 2018-09-08 07:40 GMT

ఈ వారం ఎప్పటిలాగే బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఆ సినిమాల్లో ఎప్పటిలాగే ఒక్క సినిమా మాత్రమే హీరోగా నిలిచింది. ఈ శుక్రవారం ఏకంగా సునీల్ - అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్, బ్రహ్మి కొడుకు నటించిన మను, సూపర్ స్కెచ్ వంటి పేరు ఊరు లేని సినిమా, ప్రేమకు రైన్ చెక్ అనే చిన్న సినిమా, ఇంకా రానా సమర్పణ లో వచ్చిన C/O కంచరపాలెం సినిమాలు విడుదలయ్యాయి. అల్లరి నరేష్ - సునీల్ స్క్రీన్ షేర్ చేసుకున్న సిల్లీ ఫెలోస్ నిజంగానే సిల్లీగా కనబడి ప్రేక్షకులను బోర్ కొట్టించేసింది. ఈ సినిమాలో ఏ ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఆకట్టుకోలేదు. అల్లరి నరేష్ - సునీల్ ఇద్దరూ హీరోలుగా విఫలమయ్యారు. సునీల్ టైమింగ్, అల్లరి నరేష్, అక్కడక్కడా పేల్చిన కామెడీ తప్ప సినిమాలో ఎలాంటి అంశం ప్రేక్షకుడిని ఆకట్టుకోలేదు. ఇక హీరోయిన్, సంగీతం, కథ, ఇంకా చెప్పాలంటే ఈ సినిమా వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయి.

నటన బాగున్నా నస...

ఇక కమెడియన్ బ్రహ్మానందం కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజా గౌతమ్ ఎట్టకేలకు తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మనుగా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతూ చాలా సహజంగా నటించాడు. మను సినిమాలో బ్యాగ్రౌంగ్ మ్యూజిక్, కథ వినూత్నంగా ఉండి, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నప్పటికీ... సినిమాలో సాగదీత ఎక్కువైంది. అలాగే అవసరానికి మించిన డీటైలింగ్... నిడివి ఎక్కువ కావడం... స్క్రీన్ ప్లే బోరింగ్ తో నస పెట్టిన మనుగా ఈ సినిమా మిగిలిపోయింది. ఇక సూపర్ స్కెచ్ కానివ్వండి, ప్రేమకు రైన్ చెక్ కానివ్వండి అసలు ఎప్పుడు తెరకెక్కాయి.. ఎందుకు విడుదలయ్యాయి అని ప్రేక్షకుడికి ఒక క్లారిటీ లేదంటే నమ్మాలి. ఇక ఈ వారం చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోలేని సినిమా హిట్ కావడం అంటే ఏమిటో C/O కంచరపాలెం నిరూపించింది.

చిన్న సినిమాగా వచ్చినా..!

అది కూడా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా C/O కంచరపాలెం. మనసు పెట్టి తీయాలి కానీ హత్తుకునే కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు ఏ సినిమా అయినా ఆదరిస్తాడు అనడానికి కంచరపాలెం సినిమా నిరూపించింది. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, రొమాన్స్ ఏది ఎంత ఉండాలో అంతే కొలతల ప్రకారం రాసుకుని మరీ తీసిన తీరు హృదయాలను కదిలిస్తుంది. అక్కడక్కడా నెమ్మదించిన ఫీలింగ్ కలిగినా అది సినిమాలో లీనమైన ప్రేక్షకుడు పెద్దగా ఇబ్బంది ఫీల్ అవ్వడు. దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్షన్ స్కిల్స్ కానీ.. మేకింగ్ స్టయిల్ కానీ.. నటీనటుల నటన కానివ్వండి, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని కంచరపాలెం సినిమా విజయానికి దోహదం చేశాయి. ఈ సినిమాకి రానా ప్రమోషన్స్ కూడా బాగా కలిసొచ్చాయి. ఇక ఈ వారం విడుదలైన అన్ని సినిమాల్లో లోబడ్జెట్ గా వచ్చిన కంచరపాలెం మంచి హిట్ అయ్యింది. కాకపోతే కమర్షియల్ గా కంచరపాలెం సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

Similar News