ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం

Update: 2018-08-20 10:00 GMT

నారా రోహిత్ మరియు జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆటగాళ్లు’ ఈ నెల 24న విడుదల కాబోతున్న సంధర్బంగా ఈ చిత్ర హీరోయిన్ దర్శన బానిక్ మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు ఈ బెంగాలీ బామ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

మీ గురించి చెప్పండి ?

మాది కొలకత్తా. నేను మోడల్ గా పని చేశాను. అలాగే బెంగాలీలో ఆరు సినిమాల్లో నటించాను. మరియు ఓ బెంగాలీ వెబ్ సిరిస్ లో కూడా యాక్ట్ చేశాను. సినిమాలు నాకు కొత్త కాదు గానీ, తెలుగులో మాత్రం ఇదే నా మొదటి చిత్రం.

‘ఆటగాళ్లు’ చిత్రంలో మీకు హీరోయిన్ గా ఎలా అవకాశం వచ్చింది ?

నేను మోడలింగ్ చేసే సమయంలో లాస్ట్ ఇయర్ ముంబాయిలో ఓ మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశాను. ఆ వీడియో కోరియోగ్రాఫర్ విష్ణు దేవా. ఆయనే నా ఫోటో షూట్ పిక్స్ ని ఈ చిత్ర దర్శక నిర్మాతలకి పంపించారు. ఆ తర్వాత నేను ఆడిషన్స్ కి వచ్చాను. ఆడిషన్స్ మొత్తం సిక్స్ రౌండ్స్ జరిగాయి. సినిమాలో కొన్ని టఫ్ సీన్స్ లో యాక్ట్ చేశాక, రోహిత్ తో ఫోటో షూట్ చేసి చూశాక ఈ పాత్రకు నేను సరిపోతానని నన్ను సెలెక్ట్ చెయ్యడం జరిగింది.

ఈ చిత్రం ట్రైలర్, ప్రోమోలు చూస్తుంటే ఇది ఒక మైండ్ గేమ్ మూవీలా అనిపిస్తోంది. మరి మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఈ సినిమాలో నా పాత్ర పేరు అంజలి. సింపుల్ గా చెప్పాలంటే తను చాలా ఇండిపెండెంట్ మరియు వర్కింగ్ లేడి. సినిమాలోని హీరో పాత్రను సిన్సియర్ గా లవ్ చేస్తోంది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. వన్ వర్డ్ లో చెప్తే ఆటగాళ్లు చిత్రంలోని ‘అంజలి’ ఓ సిన్సియర్ ప్రేమికురాలు.

మొదటిసారి తెలుగు సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించే ముందు మీరు తెలుగు సినిమాలు ఏమైనా చూసారా ?

తెలుగు సినిమాలు బెంగాలీలోకి డబ్ అవుతాయి. అలా తెలుగు సినిమాలు చూడటం జరిగింది. ముఖ్యంగా మగధీర, ఆర్య, ధృవ, అరుందతి, బాహుబలి సిరీస్ ఇలా అన్ని చూసాను. నాకు 'బాహుబలి' మూవీ చాలా బాగా నచ్చింది.

తెలుగు సినిమాలకి, బెంగాలీ సినిమాలకి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి ?

పెద్దగా వ్యత్యాసం అంటూ ఏమి ఉండదు. ఎక్కడైనా కష్టపడే పని చెయ్యాలి. ప్యాషన్ తోనే నటించాలి. కో ఆర్టిస్ట్ లతో, యూనిట్ తో కోఆర్డినేషన్ బాగుండాలి. రెండు సినీ పరిశ్రమల్లో ఒకేలా ఉంటుంది పని. కాకపోతే తెలుగు సినిమాల బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. బెంగాలీ సినిమాలు బడ్జెట్ తెలుగు సినిమాలతో పోల్చుకుంటే కాస్త తక్కువుగా ఉంటుంది, అంతే తేడా.

మరి ఈ చిత్రంలో మీతో పాటు నటించిన నారా రోహిత్, జగపతిబాబు గురించి చెప్పండి ?

నాకు షూట్ లో వాళ్లు చాలా బాగా సహకరించారు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు హైలెట్ గా ఉంటాయి. ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. వారి మధ్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మా డైరెక్టర్ పరుచూరి మురళి ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు.

తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. మరి తెలుగులో స్పష్టంగా ఎప్పుడు మాట్లాడతారు ?

నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. నెక్స్ట్ టైం మాత్రం కచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను.

మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

బాలీవుడ్ లో అయితే షారుఖాన్. ఆయన సినిమాలన్నీ చూస్తాను. ఇక తెలుగులో ఇష్టమైన హీరో అంటే.. ప్రభాస్. బాహుబలి సినిమా చూసి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగే అల్లు అర్జున్ అన్నా కూడా నాకు చాలా బాగా ఇష్టం. డైరెక్టర్లలో రాజమౌళికి నేను పెద్ద అభిమానిని.

Similar News