టాక్ బావుంటే పండగే...!

Update: 2018-12-19 06:08 GMT

ఈ భారీ వీకెండ్ కోసం... తెలుగు నుండి రెండు సినిమాలు, ఇతర భాషల నుండి రెండు సినిమాలు లైన్లోకి వచ్చేశాయి. ఈ శుక్రవారం తెలుగులో పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు విడుదలవుతుంటే, తమిళం నుండి ధనుష్ - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన మారి 2, కన్నడ నుండి కెజిఎఫ్ సినిమాలు తెలుగులో విడుదల కాబోతున్నాయి. తెలుగులో పడి పడి లేచే మనసులో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా క్యుట్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇప్పటికే ట్రైలర్ తో బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాకి కాస్త టాక్ బాగుంది అంటే... ప్రేక్షకులు క్యూ కడతారు.

అన్ని సినిమాలపైనా అంచనాలు

ఇక వరుణ్ తేజ్ - అదితీరావు - లావణ్య త్రిపాఠిల అంతరిక్షం చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఇక కన్నడ ఫిలిం కెజిఎఫ్ మీద కూడా అంచనాలు ఉన్నాయి. ధనుష్ - సాయి పల్లవి ల మారి 2 మీద తమిళంలో భారీ అంచనాలుంటే.. తెలుగులో సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి ఈ సినిమా మీద ఆటోమాటిక్ గా తెలుగు ప్రేక్షకుడు కన్నేస్తాడు. మరి ఈ లాంగ్ వీకెండ్ విన్నర్ ఎవరో కానీ.. ఏ సినిమాకి టాక్ బాగున్నా కలెక్షన్స్ కుమ్మేస్తాయి. ఎందుకంటే గత మూడు నాలుగు వారాలుగా ప్రేక్షకులను బోర్ కొట్టించే చిత్రాలే థియేటర్స్ లో ఉన్నాయి కానీ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే చిత్రమేది థియేటర్ లో లేదు.

కలిసిరానున్న క్రిస్మస్...

2.ఓ సినిమాని ప్రేక్షకులు గ్రాఫిక్స్ కోసమే భరించారు కానీ.. అసలా సినిమాలో విషయం లేకపోవడంతో.. ప్రేక్షకుడు ఫీల్ గుడ్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో ఏ సినిమా టాక్ బాగున్నా లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ దిమ్మతిరిగిపోతాయి. ఎందుకంటే శని, ఆదివారాలే కాకుండా పిల్లలకి సోమవారం, మంగళవారం, బుధవారం కూడా స్కూల్స్ కి హాలిడేస్. సోమవారం క్రిస్మస్ ఈవెంట్, మంగళవారం క్రిస్మస్, బుధవారం బాక్సింగ్ డేతో పిల్లల స్కూల్స్ కి సెలవులు. అందుకే ఏ సినిమా టాక్ లేచినా... అది ఈ లాంగ్ వీకెండ్ అండ్ వీక్ డేస్ లో వరమే అవుతుంది. చూద్దాం క్రిస్మస్ హాలిడేస్ హీరో ఎవరనేది రేపు ఒక్కరోజు ఆగితే తేలిపోతుంది.

Similar News