చిన్న‌ప్పుడు చిరంజీవి అల్ల‌రి... వామ్మో!

Update: 2018-08-19 07:49 GMT

తెలుగు ఇండ‌స్ట్రీలో చిరంజీవికి ఉన్న స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. ఆయ‌న్ని అన్న‌య్య అని ఆప్యాయంగా పిలుచుకొనేవాళ్లు ఎంతోమంది. ప‌రిశ్ర‌మ‌లోనే కాదు... ఇంట్లో కూడా చిరంజీవి అన్న‌య్యే. కొణిదెల కుటుంబంలో పెద్ద కొడుకు ఆయ‌నే. దాంతో ఇంటి బాధ్య‌త‌లన్నింటినీ ఆయ‌నే మోస్తుంటారు. త‌మ్ముళ్లు, వాళ్ల పిల్ల‌లు, సిస్ట‌ర్స్ బాధ్య‌త‌ల‌న్నింటినీ చిరునే భుజాన వేసుకొని వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌బెడుతుంటారు. బ‌య‌ట, కుటుంబంలోనూ... మెగాస్టార్ హోదాలో ఎంతో గంభీరంగా క‌నిపించే ఆయ‌న‌... తెర‌పై మాత్రం బోలెడంత అల్ల‌రి చేస్తుంటారు. అయితే ఆ అల్ల‌రి చిన్న‌ప్పట్నుంచీ ఉన్న‌దేన‌ట‌. ఆ విష‌యాన్ని చిరు అమ్మ‌గారు అంజ‌నాదేవి ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టారు.

చిన్న‌ప్పుడు చాలా అల్ల‌రి చేసేవాడ‌ని, ఒక రోజు రోడ్డుపైకి వెళ్లి అక్క‌డే నిద్ర‌పోయాడ‌ని... అది తెలిసి చాలామంది 'పిల్లాడిని అలా వ‌దిలిపెడితే ఎలా? అని న‌న్నే మంద‌లించార‌ని చెప్పారు అంజ‌నాదేవి. చివ‌రికి మా పెద్దోడి అల్ల‌రిని తాళ‌లేక మంచం కోడుకి ట‌వ‌ల్‌తో క‌ట్టేసేదాన్నని చెప్పుకొచ్చారు. ఆ మాట‌ల్ని విన్న చిరంజీవి 'పాపం క‌ద‌మ్మా.. ప‌సిపిల్లాడని కూడా చూడ‌కుండా అంత‌గా హింస పెట్టావ‌'ని న‌వ్వేశారు చిరంజీవి. అయితే అప్పుడు గోడ‌ల‌పైనా, చెట్టు కొమ్మ‌ల‌పైనా వేలాడుతూ చేసిన అల్ల‌రి సినిమాల్లోకి వెళ్లాక బాగా ప‌నికొచ్చింద‌ని, రిస్కీ స‌న్నివేశాలు చేయ‌డానికి దోహదం చేసింద‌ని చెప్పుకొచ్చాడు చిరంజీవి. ''కొన్నాళ్లుగా ఓ ఇంట్లో స్వ‌తంత్రంగా గ‌డిపిన అమ్మ‌.. ఈమ‌ధ్య నా ద‌గ్గరికి వ‌చ్చేసింద‌ని. అమ్మ నా ద‌గ్గ‌ర ఉంద‌నే సంతోషం నాకుంద‌''ని చెప్పుకొచ్చాడు చిరంజీవి.

Similar News