హమ్మయ్య ఆకలి తీరింది!!

Update: 2018-08-04 06:32 GMT

గత రెండు నెలలుగా ప్రతి శుక్రవారం సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ప్రేక్షకుల ఆకలి తీర్చిన సినిమా ఒక్కటి కనబడం లేదు. గత వారం సాక్ష్యం, హ్యాపీ వెడ్డింగ్ రెండు సినిమా విడుదలయ్యాయి. కానీ హ్యాపీ వెడ్డింగ్ సోదిలోకి కూడా లేకుండా పోయింది. ఇక సాక్ష్యం సినిమా మాత్రం ఏదో అలా.. అలా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక సాక్ష్యం కలెక్షన్స్ మాత్రం సూపర్ అంటూ ఊదరగొడుతున్నారు. ఏది ఏమైనా సాక్ష్యం సినిమాకి పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేలా కనబడం లేదు. ఇక ఒక్కవారానికే సర్దుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ వారం బరిలో పోటీకి దిగిన మూడు సినిమాలో రెండు చిన్న సినిమాలు థియేటర్స్ దుమ్ము దులిపేసాయి. ఈ శుక్రవారం మారుతీ - దర్శకుడు ప్రభాకర్ ల కాంబోలో వచ్చిన బ్రాండ్ బాబు నిజంగానే బ్రాండ్ అనేసింది. సినిమాలో బ్రాండ్ అంటే కంటెంట్ లేకపోతె ఏమవుతుందో ఈ సినిమా చూపించింది. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా పరమ బోరింగ్ అంటున్నారు ప్రేక్షకులు. ఇక బ్రాండ్ బాబు సినిమాలో కేవలం సినిమాటోగ్రఫీ అక్కడక్కడా బ్యాగ్రౌండ్ తప్ప మరే ప్లస్ పాయింట్ లేదంటున్నాను.. ఉన్నవన్నీ నెగెటివ్ పాయింట్స్... కథ, కథనం, డైరెక్షన్, ఎడిటింగ్ ఇలా అన్ని విషయాల్లో బ్రాండ్ బాబు ఫెయిల్ అయ్యింది. అసలు ఈ సినిమా ని ఓవరాల్ గా ఒక సీరియల్ కింద్ పోల్చేస్తున్నారు.

చి.ల.సౌ మాత్రం.....

ఇక రెండో సినిమా అక్కినేని మనవడు సుశాంత్ నటించిన చి. ల.సౌ. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా మెప్పించింది. చిన్న చిన్న మైనస్ పాయింట్స్ తప్ప సినిమా బావుందని అన్ని వర్గాల ప్రేక్షకులు ఒప్పుకుంటున్నారు. మొదటిసారి సుశాంత్ మంచి కథని ఎన్నుకోవడమే కాదు... లుక్స్ పరంగా.. నటన పరంగా సుశాంత్ ఇరగదీస్తే.. ఈ సినిమా హీరోయిన్ రుహనా శర్మ నేచురల్ నటనతో అదరగొట్టింది. ఇక రాహుల్ కూడా తాను అనుకున్న సింపుల్ స్టోరీ లైన్ ని కథగా మలిచి సినిమాని డైరెక్ట్ చేసాడు. ర‌చ‌న ప‌రంగా, టేకింగ్ ప‌రంగా ఎంతో ప‌రిణ‌తి క‌న‌బ‌రిచాడు. ఇలాంటి చిన్న క‌థ‌ల్ని సినిమాలుగా తీయ‌డం సాహ‌స‌మే. రాహుల్ మాత్రం చాలా స్ప‌ష్ట‌త‌తో చిత్రాన్ని తీశాడు. అలాగే ఈ సినిమాకి సుకుమార్ సినిమాటోగ్రఫీ ప్రాణం పోసింది. ప్ర‌శాంత్ విహారి సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇక సెకండ్ హాఫ్ లో కాస్త డల్ అవడం, ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్ గా ఉంటే సినిమా మరింత హిట్ అయ్యేదని.. అయినా ఈ సినిమాకి క్రిటిక్ ఓవరాల్ గా హిట్ మార్కులే వేశారు.

హిట్ లిస్ట్ లోకి.....

ఇక మూడో సినిమా అడివి శేష్ గూఢచారి. తక్కువ బడ్జెట్ తో అడివి శేష్ హీరోగానే కాదు కథను కూడా అందించి కొత్త దర్శకుడు తో చేసిన గూఢచారి సినిమా కూడా హిట్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. స్పై థ్రిల్లర్ కథతో ఈ సినిమా టేకింగ్ పరంగానే కాదు.. అడివి శేష్ నటన, స్టైలిష్ లుక్స్, నాగార్జున మేనకోడలు సుప్రియ నటన, సెకండ్ హాఫ్, ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్, స్క్రీన్ ప్లే, కథ లాంటి ప్లస్ పాయింట్స్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కాస్త కామెడీ కొరవడటం, ఫస్ట్ హాఫ్ వీక్ అయినప్పటికీ.. ఈ సినిమా కి హిట్ మార్కులే పడ్డాయి. క్రిటిక్స్ కూడా ఓవరాల్ గా హిట్ మార్కులే వేశారు. మరి ఈ శుక్రవారం బ్రాండ్ బాబు.. తేలిపోగా.. చి.ల.సౌ, గూఢచారి సినిమాలు ప్రేక్షకుల దాహాన్ని తీర్చేసాయి. మరి ఈ వారం హీరోలు సుశాంత్ అండ్ అడవి శేష్.

Similar News