బ్ర‌హ్మి హ‌స్యానికి కాలం చెల్లిందా... చెల్లించేశారా..

Update: 2018-05-22 05:15 GMT

బ్ర‌హ్మానందం.. ఈ పేరు వింటే మొండిముఖంలో న‌వ్వులు పూస్తాయి.. తెర‌పై క‌నిపిస్తే చాలు.. క‌డుపుబ్బా న‌వ్వాల్సిందే.. ఎలాంటి సెకండ్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా త‌న హావ‌భావాల‌తోనే హాస్యం పండించ‌డంలో ఆయ‌నది ప్ర‌త్యేక పంథా.. ద‌ర్శ‌కుడు, హీరోల‌తో సంబంధం లేకుండా కేవ‌లం బ్ర‌హ్మికోస‌మే ప్రేక్ష‌కులు సినిమాకు వెళ్తారు. ప‌లానా సినిమాలో బ్ర‌హ్మి ఉన్నాడా..? అని అడిగి మ‌రీ వెళ్లే అభిమానులూ ఉన్నారు. ఇక‌ ఆయ‌న ఉన్నాడంటే చాలు.. సినిమా హిట్టేన‌ని నిర్మాత, ద‌ర్శ‌కుడికి కొండంత న‌మ్మకం. ఆయ‌న‌కోస‌మే క‌థ‌లో స‌ప‌రేట్ ట్రాక్ ఉండేలా ద‌ర్శ‌కులు చూసుకోవాల్సిన ప‌రిస్థితి. నిజానికి ఒక కుటుంబంలోని స‌భ్యులంద‌రీ హీరోల పేర్లు తెలుస్తాయో లేదోగానీ బ్ర‌హ్మిది మాత్రం మ‌రువ‌లేని ముఖ‌ప‌రిచ‌యం. ఇలా హాస్యంలో తెలుగు సినిమా తెర‌పై మూడు ద‌శాబ్దాలుగా రారాజుగా వెలుగొందిన బ్ర‌హ్మానందం గ‌త నాలుగైదేళ్లుగా కొంత వెన‌క‌బ‌డ్డార‌నే టాక్ వినిపిస్తోంది.

బ్ర‌హ్మీ ఇటీవ‌ల న‌టించిన సినిమాలు చూస్తే ఆయ‌న ట్రాక్ ప‌ర‌మ రోటీన్‌గా ఉంటోంది. చాలా వ‌ర‌కు హీరోపాటు సాగే పాత్ర‌ల‌కే బ్ర‌హ్మిని ప‌రిమితం చేస్తున్నారు. చాలా వ‌ర‌కు సినిమాల్లో బ్ర‌హ్మి సెటైర్లు వేయ‌డం.. దానిని డామినేట్ చేస్తూ హీరో తిరిగి గూబ గుయ్‌మ‌నిపించ‌డం, లేదా బ్ర‌హ్మీని ప‌ట్టుకుని వాయించేయ‌డం ఇదే ఫార్ములా చూసిచూసి ప్రేక్ష‌కుల‌కు బోర్‌కొట్టింది. ఆయ‌న‌కు త‌గ్గ హాస్యం ట్రాక్‌ను క్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కులు కూడా విఫలం చెందార‌నే టాక్ కూడా వినిస్తోంది. ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు కూడా ఎంత వ‌ర‌కూ బ్ర‌హ్మీని హీరో ముందు బ‌క‌రాను చేసే క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే ఆయ‌న‌కు ఇస్తుండ‌డంతో ఆయ‌న్నే ప‌దే ప‌దే అదే క్యారెక్ట‌ర్‌లో చూసిన ప్రేక్ష‌కులు విసుగెత్తిపోతున్నారు.

ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం తెర‌మీద క‌నిపిస్తున్నాడు అంటే నాన్‌స్టాప్ న‌వ్వులే. ఈ రోజు అదే బ్ర‌హ్మీ తెర‌మీద క‌నిపించాడంటే ఎప్పుడు వెళ‌తాడు... ఈ సీన్లు ఎప్పుడు పోతాయ్‌... హీరోనో లేదా హీరోయిన్ లేదా సాంగ్ ఎప్పుడు వ‌స్తుంద్రా బాబూ అని వెయిట్ చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే బ్ర‌హ్మానందం హాస్యానికి ఇక కాలం చెల్లింద‌నే వాద‌న తెలుగు ఇండ‌స్ట్రీలో మొద‌లైంది. అందుకే ఆయ‌న‌ను న‌మ్ముకుని తీసిన సినిమాలు కూడా ప్రేక్ష‌కాద‌రణ పొంద‌లేక‌పోయాయి. ఇక ఇదేస‌మయంలో కొత్త‌త‌రం హాస్య‌న‌టులు రావ‌డం కూడా బ్ర‌హ్మానందాన్ని కొంత ఇబ్బందుల్లోకి నెట్టింద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న హాస్యాన్ని ప్రేక్ష‌కులు ఆస్వాదించ‌లేక‌పోతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. అలీ, సునీల్, తాగుబోతు ర‌మేశ్‌తోపాటు త‌దిత‌ర‌ హాస్య‌న‌టులు సినీరంగంలోకి దూసుకొచ్చినా కొన్నాళ్ల‌కే త‌మ రూటు మార్చుకున్నారు. సునీల్ హీరోగా అవ‌తార‌మెత్త‌డంతో హాస్యం పాత్ర‌ల‌కు దూర‌మ‌య్యారు. ఇదే స‌మ‌యంలో బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ టీములు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. హాస్యాన్ని పండించ‌డంలో స‌రికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాయి. వారంవారం వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న హాస్య‌న‌టులు శ‌క‌ల‌క శంక‌ర్‌, హైప‌ర్ ఆది, ర‌చ్చ ర‌వి, త‌దిత‌రులు ఇప్పుడు తెలుగుప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులు. మంచిమంచి స్కిట్ల‌తో అల‌రించారు. మొద‌ట్లో వారేసే పంచ్‌లతో ఇంటిల్లిపాదీ క‌డుపుబ్బా నవ్వుకున్నారు. నిజానికి ఇప్పుడా ప‌రిస్థితులు లేవ‌నుకోండి.

అయితే... బ్రహ్మానందం హాస్యానికి, జ‌బ‌ర్ద‌స్త్ హాస్యానికి చాలా తేడామాత్రం ఉంద‌ని చెప్పుకోవాలి. బ్ర‌హ్మానందం హాస్యం ప్రేక్ష‌కుల‌కు ఔష‌ధంగా అందింద‌న‌డంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ, జ‌బ‌ర్ద‌స్త్‌లో మ‌నిషి రంగు, రూపుపై సెటైర్లు వేస్తూ, కించ‌ప‌రుస్తూ, సున్నిత‌మైన మాన‌వ‌సంబంధాలను హేళ‌న చేస్తూ ఎక్కువ‌గా జోకులు వేస్తున్నారు. అంతేగాకుండా... ఎక్కువ‌గా సెకండ్ మీనింగ్ డైలాగ్స్‌తో స్కిట్‌ను ముగిస్తున్నారు. ఈక్ర‌మంలోనే హాస్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చిప‌డుతున్నాయి.

నిజానికి ఇప్పుడు కుటుంబ స‌భ్యులంద‌రూ టీవీముందు కూర్చుని జ‌బ‌ర్ద‌స్త్‌ను స్కిట్ల‌ను చూడ‌లేని ప‌రిస్థితి ఉంద‌నే వాద‌న కూడా బలంగా వినిపిస్తోంది. న‌డ‌వ‌డిక‌ను, వ్య‌క్తిత్వాన్ని సూచిస్తూ.. సంద‌ర్భాను సారంగా వ‌చ్చే హాస్యాన్నే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న విష‌యం కూడా త్వ‌ర‌లోనే జ‌బ‌ర్ద‌స్త్ న‌టుల‌కు అర్థ‌మ‌వుతుంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.

హీరోలే కామెడీ చేయ‌డం...

గ‌తంలో మెయిన్ క‌థ‌లో కామెడీ ట్రాక్ స‌ప‌రేట్‌గా ఉండేది. ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు ఈ కామెడీ ట్రాక్‌లో ఉండే క‌మెడియ‌న్ల కోసం ప్ర‌త్యేకంగా కామెడీ ట్రాక్ రాసేవారు. సినిమా మ‌ధ్య‌లో ఈ కామెడీ ట్రాక్ వ‌చ్చి పోతుంటుంది. అయితే ఇప్పుడు ట్రెండ్ మార‌డంతో ఎక్కువ స్క్రీప్ ప్రెజ‌న్సీ హీరో, హీరోయిన్ల‌కే ఇవ్వాల్సి వ‌స్తోంది. ఇప్పుడు హీరోలే కామెడీ చేసేస్తున్నారు. హీరోలు హీరోయిన్ల‌ను ఆట‌ప‌ట్టించ‌డంలోనో లేదా విల‌న్ల‌ను, ఇత‌ర క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను ఏడిపించే ప‌నులో చేస్తుంటారు. ఈ సీన్ల వ‌ల్ల హీరోల‌తోనే కామెడీ ర‌న్ చేయిస్తుండ‌డంతో స‌ప‌రేట్ కామెడీ ట్రాక్‌ల‌ను త‌గ్గించేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు సినిమాల్లో బ్ర‌హ్మీ అవ‌స‌రం త‌గ్గిపోయేలా చేసింది. ఇక సంవ‌త్స‌రాలుగా బ్ర‌హ్మీని తెర‌మీద చూసి చూసిన వాళ్ల‌కు కొంత‌మంది ఆయ‌న కామెడీ న‌చ్చ‌డం లేదు.

Similar News