బాల‌య్య ఖాతాలో మ‌రో సెంచ‌రీ....

Update: 2018-04-18 01:59 GMT

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా సంక్రాంతికి వ‌చ్చిన సినిమా జై సింహా. బాల‌య్య గ‌త మూడేళ్లుగా సంక్రాంతికి త‌న సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. 2016లో డిక్టేట‌ర్‌, 2017లో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, 2018లో జై సింహాగా వ‌చ్చాడు. ఈ మూడు సినిమాలు 100 రోజుల పండ‌గ జ‌రుపుకున్నాయి. ఈ మూడు సినిమాల‌కు ముందు నుంచి వ‌చ్చిన లెజెండ్ సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. లెజెండ్ ఏకంగా క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు, క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు సెంట‌ర్ల‌లో 400 రోజులు ఆడింది.

లెజెండ్ త‌ర్వాత వ‌చ్చిన ల‌య‌న్ గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేటలో 100 రోజులు ఆడింది. ల‌య‌న్ డిజాస్ట‌ర్ అయినా కూడా అక్క‌డ 100 రోజులు ఆడించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన డిక్టేట‌ర్ విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లిలో 100 రోజులు ఆడింది. ఇక గ‌త సంక్రాంతికి వ‌చ్చిన శాత‌క‌ర్ణి కూడా రాయ‌ల‌సీమ‌లో 100 రోజులు ఆడింది. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరుతో పాటు అదే జిల్లాలోని గూడూరులో కూడా శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది.

ఇక సంక్రాంతికి వ‌చ్చిన జై సింహా సినిమా కూడా ఏప్రిల్ 21తో 100 రోజులు కంప్లీట్ చేసుకోనుంది. ఈ సంక్రాంతికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసికి పోటీగా 12న రిలీజ్ అయిన జై సింహాకు మంచి మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమా బ‌య్య‌ర్ల‌కు లాభాలు కూడా తెచ్చిపెట్టింది. తాజాగా జై సింహా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట రామ‌కృష్ణ థియేట‌ర్‌లో 100 రోజులు కంప్లీట్ చేసుకోనుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 22వ తారీఖున గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట న్యూ మార్కెట్ యార్డ్ లో సాయంత్రం 5.00 గంటలకు 100 రోజుల వేడుకను నిర్వహిస్తున్నారు. గ‌తంలో ఇదే చిల‌క‌లూరిపేట‌లో క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ కూడా 100 రోజులు ఆడింది. రాయ‌ల‌సీమ‌తో పాటు చిల‌క‌లూరిపేట నంద‌మూరి సినిమాల శ‌త‌దినోత్స‌వాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది.

Similar News