బాలయ్య అల్లూరి గెటప్ లో...

Update: 2018-11-02 04:56 GMT

నందమూరి తారక రామారావు అంటే నటనలో ఆయనకు మించిన శక్తి లేదంటారు. ఏ పాత్ర వేసిన అద్భుతంగా పండేది. కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు, కర్ణుడు, ఇలా ఏ పాత్రకైనా ఎన్టీఆర్ ఇట్టే అతికేవారు. ఎన్టీఆర్ కూడా తనకు నచ్చిన పాత్రలను అంతే ఇష్టంగా చేసేవారు. దేవుడిగా అంటే కృష్ణుడిగా, రాముడిగా ఇలాంటి పాత్రలు వేసేటప్పుడు ఎన్టీఆర్ ఒక పూట భోజనం, కింద పడుకోవడం లాంటివి చాలా నిష్టగా చేసేవారట. అదేమని అడిగితె అలా చేస్తేనే పాత్ర బాగా పండుతుందని సెలవిచ్చేవారట. అయితే ఎన్టీఆర్ తనకు నచ్చిన ఒక సినిమా చేయలేకపోయానని కొన్నాళ్ళు బాధపడేవారట.

ఆ సినిమా మరేదో కాదు.. కృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఐనా అల్లూరి సీతారామరాజు సినిమా ముందుగా ఎన్టీఆర్ చెయ్యాలనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్టు లేట్ అయ్యేసరికి ఆ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ చేసేసాడట. అప్పట్లోనే ఆ సినిమా అదరగొట్టే హిట్ అయ్యింది. అయితే కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన ఎన్టీఆర్ కి ఆ సినిమా బాగా నచ్చిందట. తర్వాత మాత్రం ఇక ఆ సినిమా చెయ్యాలనే ఆలోచన పక్కన పెట్టేశారట. అయితే ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ఒక పాటలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో మురిపించి తనకిష్టమైన కోరికను తీర్చుకున్నారు.

ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ లో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ కూడా అల్లూరి సీతారామరాజు గెటప్ వెయ్యబోతున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు లో అల్లూరి సీతారామరాజు గెటప్ కి సంబందించి షూటింగ్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ అల్లూరి లుక్ ని ఈ దీపావళికి విడుదల చేస్తారనే సమాచారం అందుతుంది. ఇప్పటికే పండక్కి పబ్బానికి లుక్స్ మీద లుక్స్ వదులుతూ సినిమా మీద దర్శకుడు క్రిష్ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ బయోపిక్ లుక్ ఈ దీపావళిది ఎలా వుండబోతుందో చూద్దాం.

Similar News