అన్నదమ్ములను స్టార్ హీరోలు ఏం చేస్తారో..?

Update: 2018-12-21 10:18 GMT

ఈవీవీ బ్రతికున్నపుడు ఆయన కొడుకులు రాజేష్, నరేష్ చేతి నిండా సినిమాలతో కళకళలాడేవారు. అల్లరి నరేష్ కామెడీ హీరోగా మారితే.. ఆర్యన్ రాజేష్ మాత్రం ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆర్యన్ రాజేష్ హీరోగా ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. ఈవీవీ బ్రతికుంటే.. కొడుకులని హీరాగానే పెట్టి ఏదో ఒక సినిమా చేస్తుండేవాడు. కానీ ఆయన మరణంతో ఆర్యన్ రాజేష్ సినిమాలకు దూరమయ్యాడు. ఇక అల్లరి నరేష్ కామెడీ కూడా వర్కౌట్ అవడం లేడు. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్నాడు. తాజాగా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. ఆర్యన్ రాజేష్... రామ్ చరణ్ మూవీ వినయ విధేయ రామలో చరణ్ కి అన్నగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సినిమా హిట్ అయ్యి రాజేష్ పాత్ర అందరికీ కనెక్ట్ అయితే... మళ్లీ ఆర్యన్ రాజేష్ సినిమాలతో బిజీ అవుతాడు.

మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్

ఇక అల్లరి నరేష్ హీరోగా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ మహర్షి సినిమాలో మహేష్ బాబుకి ఫ్రెండ్ గా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్... రవి అనే పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ బాబుకి ప్రాణ స్నేహితుడిగా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదలవుతుంది. మరి మహేష్ మహర్షి హిట్ అయితే అల్లరి నరేష్ మరికొంత మంది స్టార్ హీరోల సినిమాల్లో ఏ స్నేహితుడిగానో, తమ్ముడిగానో మారిపోతాడు. ఒకవేళ ఆ సినిమా తేడా కొడితే మళ్లీ హీరోగానే ట్రై చేసుకుంటాడు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ అన్నదమ్ములను ఏ తీరానికి చేరుస్తారో చూడాలి.

Similar News