2016 లో ఈ హీరోకి ఇది ఆరో విడుదల

Update: 2016-12-30 02:19 GMT

నట శేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన కెరీర్లో నటుడిగా 350 చిత్రాలు దాటగలిగారు అంటే నాటి తరం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలగదు కానీ నేటి తరం ప్రేక్షకులకు మాత్రం పెద్ద విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం, నట సింహం బాల కృష్ణ 100 వ చిత్రాలకి చేరుకుంటేనే చాలా అరుదైన సంచలనంగా పరిగణిస్తున్నాం. ఇందుకు కారణం కృష్ణ గారి తరువాతి తరం నటులు డబల్ కాల్ షీట్స్ తో చిత్రీకరణలలో పాల్గొనలేకపోవటమే. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రేక్షకులను పలకరించినా పరవాలేదు కానీ ఆ ఒక్కసారి మాత్రం మళ్లీ ఏడాది పాటు గుర్తుండిపోయేలా పలకరించాలనుకుంటున్నారు నేటి తరం యువ కథానాయకులు. అందుకే కథ చర్చల్లోనే యువ స్టార్ హీరోస్ దాదాపు రెండు నెలలు పైన గడుపుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరుణంలో యువ కథానాయకుడు నారా రోహిత్ ఈ ఏడాది ఏకంగా ఆరో విడుదలకు సిద్దమైపోయాడు.

2016 ప్రథమార్ధంలో నారా రోహిత్ నటించిన తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే చిత్రాలు విడుదల కాగా ద్వితీయార్ధంలో జ్యోఅచ్చుతానంద, శంకర విడుదలయ్యాయి. ఈ శుక్రవారం(డిసెంబర్ 30 ) నారా రోహిత్, శ్రీ విష్ణు లు నటించిన అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో బిజీగా వున్న రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం పై ప్రగాఢ నమ్మకంతో వున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన గత ఐదు చిత్రాలకంటే ఎంతో గొప్పగా ఉంటుంది అని భరోసా ఇస్తున్నాడు. రోహిత్ కెరీర్లో జ్యోఅచ్చుతానంద మెమొరబుల్ ఫామిలీ హిట్ గా నిలవగా, ఇప్పుడు రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం ఈ ఏడాది సినిమాలలోనే ది బెస్ట్ అని అభివర్ణించడం తో అంచనాలు పెరుగుతున్నాయి. మరి రోహిత్ 2016 సెండ్ ఆఫ్ మూవీ ఎలా వుండబోతుందో చూద్దాం.

Similar News