బాబోయ్ కొత్త సైబర్ స్కాం ! లక్షల రూపాయలు కొల్లగొడుతున్న మోసగాళ్లు

మీకో పార్సల్ వచ్చిందంటూ.. వివిధ నగరాలకు చెందిన ప్రజల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంటున్న కత్త మోసం తాజాగా వెలుగు చూసింది.

Update: 2023-11-27 05:46 GMT

మీకో పార్సల్ వచ్చిందంటూ.. వివిధ నగరాలకు చెందిన ప్రజల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంటున్న కత్త మోసం తాజాగా వెలుగు చూసింది. దీనిని కొరియర్ స్కామ్ అని పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి.. మోసగాళ్లు తమను తాము పోలీసు అధికారులు, కస్టమ్ అధికారులు, NCRB ఏజెంట్‌లు చెప్పుకుంటూ ఉంటారు. మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్ధాలు వంటి నిషిద్ధ వస్తువులు ఉన్న పార్శిల్‌ మీకు వచ్చిందని చెబుతూ బెదిరింపులకు దిగుతూ ఉంటారు. మీరు పార్సల్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే అదొక నిషేధిత వస్తువు అని.. తాము సంబంధిత అధికారులమంటూ మరొక కాల్ వస్తుంది. మీ పేరుపై వచ్చిన కొరియర్ ఓపెన్ చేస్తే డ్రగ్స్ బయటపడ్డాయి. మీ మీద కేసు బుక్ చేయాలి అంటూ భయపెడతారు. అధికారులు చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో మోసగాళ్ల మాటలను బాధితులు నమ్మేసి.. వారు అడిగినంత లేదంటే తమ దగ్గర ఉన్న వీలైనంత డబ్బులను లాగేసుకుంటూ ఉంటారు.

చాలా సందర్భాలలో మిస్డ్ కాల్‌తో ఈ స్కామ్ ప్రారంభమవుతాయి. వ్యక్తి తిరిగి కాల్ చేసినప్పుడు, వారు కొరియర్ కంపెనీ హెల్ప్‌లైన్‌కు చేరుకున్నారని తెలియజేసే ఆటోమేటెడ్ వాయిస్ సందేశం వింటారు. ఆ తర్వాత ఒక పోలీసు అధికారి లేదా కస్టమ్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న వ్యక్తి బాధితులను భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆధార్ నంబర్, ఇతర గుర్తింపు, బ్యాంక్ వివరాల వంటి వ్యక్తిగతమైన వివరాలను సేకరించి వారి నుండి డబ్బును లాక్కోడానికి ప్రయత్నిస్తారు.

బెంగళూరుకు చెందిన 66 ఏళ్ల దేబాశిష్ దాస్ అనే వ్యక్తి ఇటీవల కొరియర్ స్కామ్‌లో బాధితుడయ్యాడు. మొత్తం రూ. 1.52 కోట్ల రూపాయలను కేటుగాళ్లు దోచేశారు. ఫెడెక్స్ ఉద్యోగిగా చెప్పుకునే వ్యక్తి నుంచి నవంబర్ 10న అతనికి ఫోన్ వచ్చింది. తైవాన్‌ నుంచి వచ్చిన కొరియర్‌లో ఆరు క్రెడిట్‌ కార్డులు, గడువు ముగిసిన పాస్‌పోర్టులు, ఎండీఎంఏ డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించామని.. దీంతో నీపై ముంబైలో కేసు నమోదైందని బాధితుడికి తెలిపాడు. బాధితుడిని స్కైప్ కాల్‌లో అంధేరీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించమని చెప్పారు. అతని పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించామని పోలీసు అధికారులుగా నటిస్తున్న మోసగాళ్ళు అతనికి చెప్పారు. ఆ తర్వాత బాధితుడి డబ్బును, అతని ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా రూ. 1.52 కోట్లను వారి ఖాతాకు బదిలీ చేయగలిగారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, ఈ సంవత్సరం బెంగళూరులోనే కొరియర్ స్కామ్ కి సంబంధించిన 250 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. జూన్ 2023లో, బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అతని భార్య సైబర్ మోసానికి గురయ్యారు. ఈ మోసగాళ్ల వల్ల ఇంజనీర్ రూ.33 లక్షలు పోగొట్టుకున్నాడు.

గత వారం.. బెంగళూరు పోలీసులు ఈ కేసుల దర్యాప్తులో భాగంగా మరో మూడు రకాల సాధారణ సైబర్ మోసాలు - ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ మోసం (116 కేసులు), వాట్సాప్ సెక్స్‌టార్షన్ (115 కేసులు), ఆన్‌లైన్ జాబ్ మోసం (4,607 కేసులు) - గుర్తించారు. అధికారులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించిన మరో ఘటనకు సంబంధించి హైకోర్టులో ఉద్యోగి కుమార్తె కూడా మోసపోయింది. ఆ మహిళకు ముంబై నుండి కస్టమ్స్ అధికారిగా నటిస్తున్న వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఆమెను బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశారు. ఆమె ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగానే రూ.19 లక్షలు కాజేసారు.

తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా 'కొరియర్ స్కామ్‌తో జాగ్రత్త' అనే పోస్ట్‌ను షేర్ చేసింది. పార్శిల్ డెలివరీ గురించి మీకు తెలియని నెంబర్స్ నుండి వచ్చే కాల్‌లు లేదా సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. భయపడిపోయి.. వెంటనే టెన్షన్ లో ప్రతిస్పందించవద్దు.. వారి డిమాండ్లకు లొంగిపోవద్దు.
#Dial 1930 for immediate help. #CourierScam #TSCSB.
Full View
పార్శిల్ స్కామ్ అనే మరొక అత్యంత అధునాతన సైబర్ క్రైమ్ కుంభకోణం ప్రజలను ఆడుకుంటూ ఉందని పేర్కొంటూ ఫోర్బ్స్ ఇండియా కూడా కథనాన్ని ప్రచురించింది. ఈ వీడియోను సెప్టెంబర్ 7, 2023న అప్లోడ్ చేశారు. పార్శిల్ లేదా కొరియర్ స్కామ్‌లో లక్షలు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.
Full View

ఈ మోసగాళ్ల బారిన పడకుండా మనమందరం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. 
Tags:    

Similar News