సోమిరెడ్డికి షాక్... ఇక ఆ యోగం లేనట్లే

వరసగా మూడు సార్లు ఓడితే టిక్కెట్లు ఇచ్చేది లేదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. లోకేష్ ప్రకటనతో ఇది అధికార ప్రకటన అయింది

Update: 2022-05-27 13:44 GMT

వరసగా మూడు సార్లు ఓడితే టిక్కెట్లు ఇచ్చేది లేదని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. యువనేత లోకేష్ ప్రకటనతో ఇది అధికార ప్రకటన అయింది. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో లో ఈ ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి పార్టీలో చర్చ మొదలయింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదన్నది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఈ కోవలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దీనిపై పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వరసగా ఓటములు...
నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు టిక్కెట్ దక్కే అవకాశం లేదు. ఇప్పటికే ఆయన ఐదు సార్లు ఓటమి చెందారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చివరి సారి 1999 వ ఎన్నికల్లో మాత్రమే గెలిచారు. ఆ తర్వాత ఆయన వరసగా ఓటమి చెందారు. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలపై ఆశలు పెట్టుకునే ఉన్నారు.ఖచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మకం పెట్టుకుని ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఈసారి విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు.
చినబాబు ప్రకటనతో....
లోకేష్ ప్రకటనతో సోమిరెడ్డి డీలా పడ్డారు. అయితే సోమిరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయించినట్లు వచ్చే ఎన్నికల్లో నలభై శాతం టిక్కెట్లు యువతకేనని ప్రకటించడంతో ఆయన తన కుమారుడిని పోటీ చేయించి తాను తప్పుకోవాల్సి ఉంటుంది. పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో సీనియర్ నేతగా పదవులను దక్కించుకునే ఛాన్స్ ఉంది.
సీనియర్ నేతలకు....
అయితే కాకాణిని ఓడించాలంటే తన కుమారుడి కంటే తాను మాత్రమే రంగంలో ఉంటేనే సాధ్యమవుతుందన్న వాదనలు లేకపోలేదు. సోమిరెడ్డి అభిప్రాయం కూడా దాదాపు అదే. చివరి సారి తాను పోటీ చేయాలని నిన్న మొన్నటి వరకూ భావించారు. కానీ పార్టీ నిర్ణయం ఆయన ఆశలపై అడియాశలు చల్లినట్లయింది. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే సోమిరెడ్డి ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయినట్లే. పార్టీ నిర్ణయాలు సీనియర్ నేతలకు మినహాయింపు ఉంటుందా? లేదా? అన్నది ఎన్నికల సమయానికి తేలనుంది.


Tags:    

Similar News