Tekkali : దువ్వాడకు వాయిస్ తప్ప.. బేస్ లేదా..? టెక్కలిలో వైసీపీకి కష్టాలు స్వయంకృతమేనా?

టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకూ వైసీపీ గెలవలేదు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమే దక్కింది.

Update: 2024-04-22 06:32 GMT

దువ్వాడ శ్రీనివాస్.. టెక్కలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టెక్కలి అంటేనే కింజారపు కుటుంబానికి పెట్టని కోట. అలాంటి చోట వైసీపీ ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి. అక్కడ వైసీపీ అధినాయకత్వం అన్నీ రాంగ్ స్టెప్‌లు వేశాయని చెబుతున్నారు. కేవలం జగన్ తనకున్న అభిమానంతోనే ఆ టిక్కెట్ ను దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించారన్న అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతుంది. ఒక్క దువ్వాడ కోసం అందరినీ దూరం చేసుకుంటున్నారు. దీంతో టెక్కలిలో వైసీపీ ఆపసోపాలు పడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అచ్చెన్నాయుడు మీద ఉన్న కొద్దో గొప్పో వ్యతిరేకత కూడా దువ్వాడ దెబ్బకు దిష్టి తీసినట్లు పోయిందన్న కామెంట్లు వినపడుతున్నాయి.

ఇప్పటి వరకూ...
టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకూ వైసీపీ గెలవలేదు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అక్కడ పరాజయమే దక్కింది. అభ్యర్థులను మార్చినా ఫలితం లేదు. అయినా వైసీపీ హైకమాండ్ కు టెక్కలి విషయంలో పార్టీ అభ్యర్థి ఎంపికపై తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికి టెక్కలి నియోజకవర్గంలో వరసగా రెండు సార్లు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. అచ్చెన్నాయుడు వరసగా పదేళ్ల పాటు టెక్కలి ఎమ్మెల్యేగా ఉండటంతో పార్టీలోనూ, ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత అయితే ఉంది. అయితే దానిని క్యాష్ చేసుకోవాల్సిన వైసీపీ మరోసారి తప్పటడుగులు వేసిందన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీగా ఉండి...
దువ్వాడ శ్రీనివాస్ కరడు కట్టిన జగన్ అభిమాని. ఆయనకు 2014 ఎన్నికల్లో వైసీీపీ నుంచి టిక్కెట్ ఇచ్చారు జగన్. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో దువ్వాడకు కాకుండా పేరాడ తిలక్ కు ఇచ్చారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. దీంతో తొలుత దువ్వాడ శ్రీనివాస్ వాణిని టెక్కలి ఇన్‌ఛార్జిగా వైసీపీ నియమించింది. ఆమెకే టిక్కెట్ ఇస్తారనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆమెకు కాకుండా దువ్వాడ శ్రీనివాస్ కే టిక్కెట్ జగన్ కేటాయించారు. దువ్వాడకు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఆయన మరోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ముఖ్య నేతలతో పాటు...
ఇదంతా ఒక ఎత్తయితే దువ్వాడ సోదరుడు ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయి టీడీపీలో చేరిపోయారు. ఇది ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ. దీనికితోడు ఇప్పుడు దువ్వాడ భార్య వాణి కూడా తాను కూడా ఎన్నికల బరిలో ఉంటానని చెబుతున్నారు. అదే జరిగితే దువ్వాడ గెలిచేదెక్కడ? అంటూ సొంత పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. మరో కీలకనేత, కళింగ సామాజికవర్గానికి చెందిన కిల్లి కృపారాణి కూడా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ కు కుటుంబం నుంచే మద్దతు లేనప్పుడు ఇక ప్రజల నుంచ ఎలా వస్తుందన్న వ్యాఖ్యలు సహచర నేతలే చేస్తున్నారు. మరి జగన్ ఈ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లేగా? అంటూ కొందరు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.


Tags:    

Similar News