ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడంతస్తుల భవంతిలో సాయంత్రం 4.40 సమయంలో మంటలు చెలరేగాయి.

Update: 2022-05-14 03:13 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 27 మంది దుర్మరణం పాలయ్యారు. ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడంతస్తుల భవంతిలో సాయంత్రం 4.40 సమయంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏకంగా 27 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారని.. దాదాపు 60 నుంచి 70 మందిని రక్షించామని పోలీసులు తెలిపారు. ఇంకా బిల్డింగ్ ను పూర్తిగా గాలించాల్సి ఉండడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. ఘటన గురించి తెలియగానే 24 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపామని ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు. ఈ భవనంలో పలు కంపెనీల కార్యాలయాలున్నాయి. తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాల సంస్థలో మంటలు ఆరంభమై భవనమంతా పాకాయని డీసీపీ శర్మ చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు.

శుక్రవారం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల సమయంలో మంటలు అంటుకోగా.. అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్ల సాయంతో అర్ధరాత్రి వరకూ మంటలను ఆర్పేందుకు శ్రమించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి భవనం లోపలికి వెళ్లే సరికే వారికి కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.
ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. ఢిల్లీ అగ్నిప్రమాద ఘటన పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పు సాయం చేస్తామన్నారు.
'ఈ దుర్ఘటన గురించి తెలియగానే షాకయ్యాను. అగ్నిప్రమాదం ఎంతో బాధించింది. అధికారులతో టచ్‌లో ఉన్నాను. ధైర్యవంతులైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ప్రాణాలను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డారు. అందర్నీ దేవుడు చల్లగా చూడాల'ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అగ్నిప్రమాదం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటన పట్ల ఎంతో చింతిస్తున్నానని.. ఎప్పటికప్పుడు అధికారులతో టచ్ లో ఉండి విషయాలను తెలుసుకుంటూ ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 12 మంది సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణలో, ప్రస్తుతం పరారీలో ఉన్న భవన యజమాని వద్ద అగ్నిమాపక ఎన్‌ఓసి లేదని పోలీసులు తెలుసుకున్నారు.


Tags:    

Similar News